Begin typing your search above and press return to search.

అడ్డాల సినిమాలో ఆ హీరో కూడా..

By:  Tupaki Desk   |   19 May 2018 12:37 PM IST
అడ్డాల సినిమాలో ఆ హీరో కూడా..
X
‘బ్రహ్మోత్సవం’ దెబ్బతో రెండేళ్లు అడ్రస్ లేకుండా పోయాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమా అతడికి అలాంటిలాంటి చెడ్డ పేరు తేలేదు. మహేష్ బాబు ఎంతో నమ్మి సినిమా చేస్తే అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడిగా అప్రతిష్ట మూటగట్టుకున్నాడు అడ్డాల. సినిమాలు ఫ్లాపవడం మామూలే కానీ.. ఇది మహేష్ కు అవమాన భారాన్ని మిగిల్చింది. అందుకే అడ్డాల మళ్లీ ఇంకో సినిమా దక్కించుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు గీతా ఆర్ట్స్ సంస్థ అతడితో ఓ సినిమా చేయడానికి ముందుకొచ్చింది. ఈ చిత్రంలో యువ కథానాయకుడు శర్వానంద్ ఒక హీరోగా ఫిక్సయినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో మరో హీరో పాత్రకు కూడా చోటుంది. ఆ క్యారెక్టర్లో శ్రీవిష్ణు కనిపించబోతుండం విశేషం.

శర్వా-విష్ణు ఈ చిత్రంలో అన్నదమ్ములుగా నటిస్తారని సమాచారం. ఇంతకుముందు అడ్డాల అన్నదమ్ముల కథతోనే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తీశాడు. మరి ఇది ఏ స్టయిల్లో ఉంటుందో చూడాలి. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మంచి చెప్పాలన్న తాపత్రయమైతే అడ్డాలలో కనిపిస్తుంది. ఐతే ఆ క్రమంలో కమర్షియల్ అంశాల గురించి మరిచిపోతూ.. ప్రేక్షకుల ఆలోచన స్థాయికి దూరంగా సినిమాల్ని నడిపిస్తుండటంతో ఫలితాలు తేడా కొట్టేస్తున్నాయి. మరి ఈసారైనా అతను అప్రమత్తం కావాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ లో సినిమా అంటే స్క్రిప్టు సంగతి ఒక పట్టాన తేలదు. మార్పులు చేర్పులు చాలా ఉంటాయి. సినిమాను జనరంజకంగా తయారు చేయడానికి చాలా కసరత్తే జరుగుతుంది. కాబట్టి అడ్డాల నుంచి ఈసారి ప్రేక్షకులు మెచ్చే సినిమా వస్తుందని ఆశిద్దాం.