Begin typing your search above and press return to search.

ఆ రెండు సినిమాలు వదులుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు!

By:  Tupaki Desk   |   16 Feb 2022 11:30 PM GMT
ఆ రెండు సినిమాలు వదులుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు!
X
ఇటు పూరి జగన్నాథ్ కెరియర్లోను .. అటు రవితేజ కెరియర్లోను 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. అలాంటి ఈ సినిమాను తాను చేయవలసిందనే విషయాన్ని తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో హీరో శ్రీరామ్ చెప్పాడు. ఈ సినిమాను గురించి ఆయన మాట్లాడుతూ .. "పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాను నాతో చేయాలని నిర్మాత కెఎల్ ఎన్ రాజుగారు అనుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఎనౌన్స్ చేశారు కూడా.

అయితే అప్పటికి ఫైర్ యాక్సిడెంట్ బారిన పడటం వలన నేను స్టంట్స్ చేసే పరిస్థితి లేదు. కాలిన చోటున నాకు స్కిన్ అంటించారు .. అది నాకు అప్పటికి సెట్ కాలేదు. రికవర్ కావడానికి ఎంతలేదన్నా 6 నెలలు పడుతుంది. నిజం చెప్పాలంటే పూరి సార్ వండ్రఫుల్ పర్సన్. కావాలంటే ఫైట్స్ తగ్గిస్తాను .. చేద్దామని అన్నారు. ఆయన అలా చెప్పడం ఆయన పెద్ద మనసుకు నిదర్శనం. ఆ సినిమా కథ అంతా కూడా బాక్సింగ్ తో ముడిపడి ఉంటుంది. అక్కడ రాజీ పడితే దాని సోల్ చెడిపోతుంది. అందువలన నా కోసం బాక్సింగ్ పార్ట్ తగ్గించవద్దని చెప్పాను.

ఆ తరువాత పూరి సార్ నన్ను ఒక స్టూడియోకి తీసుకుని వెళ్లారు. అక్కడ నాకు రవితేజ తారసపడ్డారు. నన్ను చూడగానే ఆయన చాలా ఆప్యాయంగా పలకరించారు. "మంచి సబ్జెక్ట్ .. మంచి సినిమా .. ఎందుకు వదులుకుంటున్నావు? ఫ్యూచర్ బాగుంటుంది .. చేసేయ్" అని అన్నారు. ఆ సమయంలో ఆయన చాలా ఫ్రాంక్ గా మాట్లాడారు. ఇప్పుడు ఉన్న పొజీషన్లలో నేను ఫైట్స్ చేయలేను అని ఆయనతో కూడా చెప్పాను. ఆ సినిమాను నేను వదులుకుంటున్నానని ఆయన కూడా చాలా బాధపడ్డారు. ఆ సినిమాను వదులుకున్నందుకు ఇప్పటికీ నేను చాలా ఫీలవుతున్నాను.

ఇక అలాగే తమిళంలో మణిరత్నం గారి సినిమాను కూడా చేయలేకపోయాను. అందుకు నేను ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. మణిరత్నం గారి 'యువ' సినిమా చేయడానికి నేను సైన్ చేశాను. నాకు జరిగిన ఫైర్ యాక్సిడెంట్ వలన ఆ సినిమాను కూడా నేను చేయలేకపోయాను. నా కోసం మణిరత్నంగారు 6 నెలలు ఆగారు. మణిరత్నం గారు ఒక డేట్ కి షూటింగు పెట్టుకున్నారంటే ఆ డేట్ కి ఆయన సెట్స్ పైకి వెళ్లిపోతారు. ఏ ఆర్టిస్ట్ కోసం ఆయన ఎక్కువ కాలం వెయిట్ చేయరు. అలాంటిది నా కోసం ఆయన 6 నెలలు వెయిట్ చేశారు.

మణిరత్నంగారు నాపై జాలిపడే వెయిట్ చేశారు .. నాతోనే చేద్దామని చూశారు. కానీ వేరే నిర్మాతకు కూడా నేను అగ్రిమెంట్ చేసి ఉన్నాను .. ఆయన లీగల్ యాక్షన్ తీసుకుంటానని అన్నారు. అప్పుడు నేను వెళ్లి మణిరత్నంగారి సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చేశాను.

అప్పుడు ఆయన "నీ కోసం 6 నెలలు వెయిట్ చేశాను .. అయినా నువు నీ నిర్ణయాన్ని మార్చుకోలేదు .. నువ్వు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ కాదు" అన్నారు. జీవితంలో మొదటిసారిగా ఆ మాటను విన్నాను .. ఆ మాట నాకు చాలా బాధను కలిగించింది. ఆయనను బాధపెట్టినందుకు మరింత బాధ కలిగింది" అని చెప్పుకొచ్చాడు.