Begin typing your search above and press return to search.

స్రవంతి రవికిషోర్.. టచ్ చేశాడండీ

By:  Tupaki Desk   |   13 Sep 2015 5:30 PM GMT
స్రవంతి రవికిషోర్.. టచ్ చేశాడండీ
X
ఓ నిర్మాత, ఓ నిర్మాణ సంస్థ మూడు దశాబ్దాలు నిర్మాణంలో కొనసాగడమంటే చిన్న విషయం కాదు. మొక్కుబడిగా ఉన్నామంటే ఉన్నామనిపించుకోకుండా.. యాక్టివ్ గా సినిమాలు తీస్తూ సాగడం ఇంకా గొప్ప విషయం. స్రవంతి మూవీస్ ఆ ఘనత దక్కించుకుంది. మూడు దశాబ్దాల క్రితం ఆరంభమైన ఈ సంస్థ ప్రస్థానం ఇప్పటికీ దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆ సంస్థ 30 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో వస్తున్న సినిమానే ‘శివమ్’. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ‘శివమ్’ ఆడియో ఫంక్షన్ లో స్రవంతి రవికిషోర్ నిర్మాతగా తన తొలి సినిమా ‘లేడీస్ టైలర్’కు పని చేసిన సాంకేతిక నిపుణుల్ని సముచిత రీతిలో గౌరవించాడు.

లేడీస్ టైలర్ దర్శకుడు వంశీ - రచయిత తనికెళ్ల భరణి - పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి - సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు - ఆ సినిమాలో ఒకానొక హీరోయిన్ గా నటించిన సంధ్యలను వేదిక ఎక్కించి సన్మానించాడు రవికిషోర్. రాజేంద్ర ప్రసాద్ షూటింగ్ కోసం విదేశాల్లో ఉండటంతో రాలేకపోయారు. ఈ సందర్భంగా తనికెళ్ల భరణి - సీతారామశాస్త్రి లేడీస్ టైలర్ నాటి రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నారు. భరణి మాట్లాడుతూ.. తాను ఈ రోజు కడుపు నిండా తింటూ, ఆనందంగా ఉన్నానంటే అందుకు ‘లేడీస్ టైలర్’ సినిమానే కారణమని.. ఆ సినిమా తనతో పాటు చాలామంది జీవితాల్ని మార్చేసిందని చెప్పారు. సిరివెన్నెల మాట్లాడుతూ.. తాను మరే సంస్థకూ రాయని విధంగా ‘స్రవంతి’ బేనర్ లో మాత్రం ఏకంగా 80 పాటలు రాశానని.. అవన్నీ అద్భుత విజయం సాధించాయని చెప్పారు. వంశీ ఎప్పట్లాగే మౌనవ్రతం పాటించాడు. నిర్మాతగా తన మూలాల్ని మరిచిపోకుండా తొలి సినిమా యూనిట్ సభ్యుల్ని గౌరవించడం ద్వారా రవికిషోర్ టచ్ చేశాడు.