Begin typing your search above and press return to search.

వియత్నాం వెళ్తున్న స్పైడర్

By:  Tupaki Desk   |   5 Oct 2017 4:29 AM GMT
వియత్నాం వెళ్తున్న స్పైడర్
X
భారతీయ సినిమాలు విదేశీ భాషల్లోకి అనువాదమవడం కొత్తేమీ కాదు. బాలీవుడ్ సినిమాలకు మొదటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది. ఈమధ్య సౌత్ సినిమాలు కూడా బాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతుండటంతో మిగిలిన భాషల్లోనూ ఆదరణ లభిస్తోంది. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు జపాన్ లో ఫ్యాన్స్ ఎక్కువ. అందుకే రజనీ సినిమాలు ఆ భాషలోకి అనువదించి విడుదల చేస్తుంటారు. రీసెంట్ గా వచ్చిన బాహుబలి చాలా భాషల్లోకి అనువాదమైంది.

ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పుడు అరుదైన రికార్డు సొంతం చేసుకుంటోంది. తొలిసారిగా వియత్నామీస్ భాషలోకి డబ్ అయి ఆ దేశంలో విడుదల కాబోతోంది. అక్కడ మహేష్ కు అభిమానులేం లేకపోయినా అక్కడ డబ్ అవడానికి కారణం ఆ సినిమా స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్. ఈయన ఉండేది చెన్నైలో అయినా జన్మత: వియత్నాం దేశానికి చెందిన వ్యక్తి. ఆయన కుటుంబం ఎప్పుడో ఆదేశం నుంచి వచ్చి ఇక్కడ సెటిలైపోయింది. దీనికి తోడు స్పైడర్ లో ఇంటర్వెల్ కు ముందొచ్చే రోలర్ కోస్టర్ ఫైట్ వియత్నాంలోనే తెరకెక్కింది. ఈ సినిమాలో ఆ దేశంలోని వారికి నచ్చుతుందన్న ఉద్దేశంతో పీటర్ హెయిన్స్ దీనిని డబ్ చేయించాడు.

విలన్ - హీరో మధ్య జరిగే ఇంటలిజెంట్ వార్ కథాంశంతో తీసిన స్పైడర్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ ఉన్న సబ్జెక్ట్. ఇది ఎంత ఇంటస్టింగ్ గా తీశారన్న దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఆ విషయంలో స్పైడర్ కు కాస్తంత మంచి మార్కులే పడ్డాయి. ఏదేమైనా ప్రిన్స్ విదేశాల్లోనూ పాపులారిటీ పెంచుకుంటే అది తెలుగువారందరికీ గర్వకారణమే కదా. మహేష్ సినిమా విదేశీ భాషలోకి అనువాదమవడం ఇది మొదటిసారేం కాదు. ఇంతకుముందు ‘అతడు’ పోలిష్ భాషలోకి అనువాదమైంది.