Begin typing your search above and press return to search.

'స్పై' ఇంట్రో గ్లింప్స్: స్టైలిష్ అండ్ డాషింగ్ లుక్ లో నిఖిల్..!

By:  Tupaki Desk   |   6 Jun 2022 5:30 AM GMT
స్పై ఇంట్రో గ్లింప్స్: స్టైలిష్ అండ్ డాషింగ్ లుక్ లో నిఖిల్..!
X
ప్రామిసింగ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న మొట్టమొదటి బహుళ భాషా చిత్రం ''స్పై''. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇటీవల విడుదలైన కిక్కాస్ టైటిల్ పోస్టర్ ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.

నిఖిల్ ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన అవతార్ లో.. తొలిసారిగా గూఢచారి పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా సోమవారం ఉదయం 'స్పై' ఇంట్రో గ్లిమ్స్ ను మేకర్స్ ఆవిష్కరించారు.

నిఖిల్‌ ను గూడాచారిగా పరిచయం చేస్తున్న ఈ చిన్న వీడియో ఆకట్టుకుంటోంది. ఇందులో కథానాయకుడు మంచు పర్వతాలలో చేతిలో ఒక ట్రాన్స్మిటర్ తో నడుస్తూ.. చివరకు ఆయుధాలతో నిండిన ఒక రహస్య స్థావరాన్ని కనుగొనడాన్ని గమనించవచ్చు.

అక్కడ ఓ గన్ తీసుకొని బుల్లెట్స్ లోడ్ చేసిన నిఖిల్.. బైక్ నడుపుతూ శత్రువులను కలుస్తూ కనిపించాడు. ఇందులో నిఖిల్ చాలా స్టైలిష్ గా డాషింగ్ గా ఉన్నాడు. ఈ సినిమాలో ఏ స్థాయిలో ఉండబోతోందనేది ఈ యాక్షన్-ప్యాక్డ్ వీడియో సూచిస్తోంది.

ఆర్యన్ రాజేష్ కొంత గ్యాప్ తరువాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. సన్యా ఠాకూర్ కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు మకరంద్ దేశ్ పాండే - అభినవ్ గోమతం - జిషు సేన్ గుప్తా - నితిన్ మెహతా - రవివర్మలు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈఓగా ED ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. రాజశేఖర్ రెడ్డి 'స్పై' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది నిఖిల్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించబడుతున్న ఈ చిత్రం కోసం అగ్రశ్రేణి నిపుణుల బృందం పనిచేస్తోంది.

ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కైకో నకహారా మరియు హాలీవుడ్ డీఓపీ జూలియన్ అమరు ఎస్ట్రాడా కలసి ఈ సినిమా కెమెరా విభాగాన్ని చూసుకుంటున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటేకర్ మరియు రాబర్ట్ లిన్నెన్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు. దర్శకుడు గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తున్నారు.

పవర్ ఫుల్ యాక్షన్ తో కూడిన 'స్పై' చిత్రానికి నిర్మాత కె. రాజశేఖర్ రెడ్డి కథను అందించడం విశేషం. శ్రీచరణ్ పాక సంగీతం సమకూరుస్తుండగా.. అనిరుధ్ కృష్ణమూర్తి మాటలు రాస్తున్నారు. అర్జున్ సూరిశెట్టి ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ను నిర్వహిస్తుండగా.. రవి ఆంటోనీ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.

''స్పై'' చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం వంటి ఐదు ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నారు. 2022 దసరాకు ప్రపంచవ్యాప్తంగా ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ శరవేగంగా షూటింగ్ జరువుతున్నారు.