Begin typing your search above and press return to search.

'సోనుసూద్'కు స్పైస్ జెట్ వారి అరుదైన గౌరవం సెల్యూట్ అంటూ..!

By:  Tupaki Desk   |   20 March 2021 9:57 AM GMT
సోనుసూద్కు స్పైస్ జెట్ వారి అరుదైన గౌరవం సెల్యూట్ అంటూ..!
X
ఇండియన్ యాక్టర్ సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటు సౌత్ అటు ఉత్తరాది ప్రేక్షకులకు సోను బాగా సుపరిచితుడు. కానీ ఎన్నో ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉంటున్న సోను.. 2020 లాక్డౌన్ సమయంలో తనలోని మానవతావాదిని బయటికి తెచ్చాడు. అంటే అతనిలోని గొప్ప ప్రజాసేవకుడు బయటికి వచ్చాడు. ఇప్పుడు సోనూసూద్ సినీప్రయాణం 2020కి ముందు తర్వాతే అని చెప్పుకోవాలి. ఎందుకంటే లాక్డౌన్ లో సోను చేసిన సేవలు దేశంలో ఎవరూ చేయలేదు. సినిమాల్లో సోను విలన్ రోల్స్ చూసి బయపడిన ప్రేక్షకులు ఇప్పుడు పూలు పరిచి నీరాజనాలు పలుకుతున్నారు. అతను జనాలకు చేసిన సేవలు అలాంటివి మరి. దేశంలో రోడ్డుపక్కన నిలిచిపోయిన పేదల దగ్గరనుండి విదేశాల్లో చిక్కుకుపోయిన ఎన్నో వేలమందిని సోను రక్షించాడు.

అందరికి తిండి, గుడ్డ, ఆశ్రయాలు ఏర్పాటు చేసాడు. ఆపదలో అందరికి అపద్భాందవుడుగా మారాడు. అందుకే దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సోనును కొనియాడుతున్నాయి. తాజాగా సోనుకు అరుదైన గౌరవం దక్కింది. స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 పై సోనూసూద్ పిక్చర్ వేశారు ఆ యాజమాన్యం. సోను చేసిన ఎన్నో సేవలకు.. అలాగే లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా విమానసేవలు నిలిచిపోగా.. సోను, స్పైస్ జెట్ వారు కలిసి విదేశాల్లో ఉండిపోయిన ఇండియన్ లను వారి కుటుంబాలకు చేర్చారు. సోనుతో అల్లుకున్న ఎన్నో అద్భుతమైన అభిమానాన్ని ఈ విధంగా చాటుకున్నారు స్పైస్ జెట్ యాజమాన్యం. 'సెల్యూట్ టు సేవియర్ సోనూసూద్' అంటూ బోయింగ్ పై రాసుకొచ్చారు. సోను సేవలకు కృతజ్ఞతగా ఇలా చేసినట్లు వారు చెప్పుకొచ్చారు. ఇకముందు కూడా ఇలాగే సోనుతో వారితో అనుబంధం కొనసాగాలని వారు కోరుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.