Begin typing your search above and press return to search.

మెగా మాస్ కాంబోలో స్పెషల్ ఫన్ సాంగ్..!

By:  Tupaki Desk   |   23 Oct 2022 3:39 AM GMT
మెగా మాస్ కాంబోలో స్పెషల్ ఫన్ సాంగ్..!
X
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''వాల్తేరు వీరయ్య''. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో Mega154 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మెగా మాస్ మూవీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే చిరు - రవితేజ కాంబినేషన్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఇప్పుడు వీరిద్దరితో ఓ ఫన్ సాంగ్ ను షూట్ ను ప్రారంభించినట్లు సమాచారం. శనివారం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.

సరదాగా సాగే ఈ పాటకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ట్యూన్ సమకూర్చగా.. శేఖర్ మాస్టర్ దీనికి డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నారు. చిరంజీవి తో పాటుగా రవితేజ కూడా కనిపించనున్న ఈ సాంగ్ సినిమాలో ప్రత్యేకంగా నిలుస్తుందని అంటున్నారు.

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న MEGA154 చిత్రాన్ని అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో చిరు కనిపించనున్నారు.

దీపావళి కానుకగా అక్టోబర్ 24న ఉదయం 11.07 నిమిషాలకు మెగా154 టైటిల్ టీజర్ ను మేకర్స్ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే 'వాల్తేరు వీరయ్య' టైటిల్ ను ఫిక్స్ చేయగా.. సోమవారం అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇందులో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నవీన్ యెర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

కోన వెంకట్ మరియు కె.చక్రవర్తి రెడ్డి కలిసి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. హరి మోహన కృష్ణ - వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్మెంట్ లో భాగమయ్యారు. ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. మెగా154 చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.