Begin typing your search above and press return to search.

అటువైపు వెళ్లే ఆలోచన లేదు: ఎస్పీ చరణ్

By:  Tupaki Desk   |   13 July 2022 2:30 AM GMT
అటువైపు వెళ్లే ఆలోచన లేదు: ఎస్పీ చరణ్
X
హను రాఘవపూడి తయారు చేసుకునే కథలు విభిన్నంగా ఉంటాయి. ఆ కథలను ఆయన తెరపై ఆవిష్కరించే తీరు కొత్తగా ఉంటుంది. అందువలన యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆయన సినిమాలకి కనెక్ట్ అవుతుంటారు. ఆయన తాజా చిత్రంగా 'సీతా రామమ్' రూపొందింది. అశ్వనీదత్ సమర్పణలో స్వప్న సినిమాస్ వారు ఈ సినిమాను నిర్మించారు. దుల్కర్ సల్మాన్ కథనాయకుడిగా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా మృణాల్ ఠాకూర్ నటించగా, మరో కీలకమైన పాత్రలో రష్మిక కనిపించనుంది.

ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ స్వరాలను అందించాడు. ఈ సినిమా నుంచి వచ్చిన 'ఓ సీత' .. 'ఇంతందం' పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలను ఎస్పీ చరణ్ ఆలపించారు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "ఈ పాటలు విన్న వాళ్లంతా మా నాన్నగారిలా పాడానని అంటున్నారు. నాన్నగారిలా పాడాలనే ప్రయత్నం నేను చేయలేదు .. ఆ తరహాలో పాడమని దర్శక నిర్మాతలు నన్ను అడగలేదు. నేను 25 ఏళ్లుగా పాడుతున్నాను. ఇంతవరకూ వెయ్యి పాటలకు పైగా పాడాను.

అప్పట్లో నాన్నగారు ఉండటం వలన నేను పాడిన కొన్ని పాటలు కూడా ఆయన ఖాతాలోకి వెళ్లిపోయాయి. మరికొన్ని పాటలు నాన్నగారు వయసులో ఉండగా పాడినట్టుగా ఉన్నాయని అనేవారు. ఇక ఇప్పుడు నాన్నగారు లేకపోవడం వలన, సహజంగానే నా స్వరంపై అందరూ దృష్టి పెట్టారు. అందువలన ఆయనకి దగ్గరగా పాడుతున్నట్టుగా అనిపిస్తోంది .. అంతకుమించి ఏమీ లేదు. ఒకవేళ ఇలా కూడా నాన్నగారిని గుర్తుచేసుకోగలిగితే అది కూడా నాకు ఆనందాన్ని కలిగించే విషయమే.

విశాల్ చంద్రశేఖర్ గారు మెలోడీస్ చాలా బాగా చేస్తున్నారు. ఎప్పటికీ బ్రతికుండేది మెలోడీస్ నే .. అందువల్లనే ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంటుందని భావిస్తున్నాను .. ఉండాలని ఆశిస్తున్నాను. ఇక కేకే గారు కూడా తేలికైన పదాలతో చాలా మంచి సాహిత్యాన్ని అందించారు.

అందుకు ఆయనకి అభినందనలు అందజేస్తున్నాను. ఈ జనరేషన్ లో చాలామంది కొత్త సంగీత దర్శకులు .. గాయనీ గాయకులు పరిచయమవుతున్నారు. ఇది నిజంగా ఆహ్వానించవలసిన పరిణామం. ఇక ఇప్పట్లో సంగీత దర్శకత్వం వైపు వెళ్లే ఆలోచన లేదు .. ఎందుకంటే గాయకుడిగానే సాధించవలసింది చాలా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.