Begin typing your search above and press return to search.

స్టూడియో తీసేస్తే ఆస్తులు అమ్మేసినట్లుగా ప్రచారం చేశారు

By:  Tupaki Desk   |   2 Aug 2021 6:37 AM GMT
స్టూడియో తీసేస్తే ఆస్తులు అమ్మేసినట్లుగా ప్రచారం చేశారు
X
లెజెండ్రీ సింగర్‌ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఉన్నప్పుడే తమిళ మరియు తెలుగు మీడియాల్లో ఆస్తులు అమ్మేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. బాలు తనయుడు ఎస్పీ చరణ్‌ సినిమాలను నిర్మించి నష్టపోవడంతో ఎస్పీ బాలసుబ్రమణ్యం సంపాదించిన పలు ప్రాపర్టీస్ ను అమ్మేయాల్సి వచ్చింది అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బాలసుబ్రమణ్యం ఎంతో ఇష్టపడి ఏర్పాటు చేసుకున్న కోదండపాణి స్టూడియోస్‌ ను జెమిని స్టూడియోస్ వారికి అమ్మేశారు అంటూ వార్తలు ఆ సమయంలో ప్రముఖంగా రావడంతో ఇండస్ట్రీలో ఆమద్య చాలా చర్చ జరిగింది. పలు సందర్బాల్లో ఆ విషయమై బాలు గారిని అడిగేందుకు ప్రయత్నించినా కూడా ఆయన నుండి సమాధానం స్పష్టంగా రాలేదని.. దాంతో ఆస్తులు అమ్మిన విషయం నిజమే అన్నట్లుగా మీడియాలో వార్తలు మరింత బలంగా వచ్చాయి.

బాలు చనిపోయిన తర్వాత ఆయన గురించిన పలు విషయాలపై మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఎస్పీబీ తనయుడు చరణ్‌ ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలపై స్పందించాడు. ముఖ్యంగా తన సినిమాల వల్ల నాన్న గారు సంపాదించిన ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది అంటూ వచ్చిన వార్తలను కొట్టి పారేశాడు. నేను నిర్మించిన సినిమాలు కొన్ని మంచి పేరు తెచ్చి పెట్టినా కొన్ని మాత్రం నిరాశ పర్చాయి. ఆర్థికంగా పలు సినిమాలు నష్టపర్చాయి. అయినా కూడా ఆస్తులు అమ్మే పరిస్థితి మాత్రం ఎప్పుడు రాలేదు. నేను ఇప్పటి వరకు నా సినిమాల వల్ల నాన్న గారు సంపాదించిన ఆస్తులను అమ్మింది లేదని... నష్టం వచ్చినా కూడా నేను ఇతర విధంగా భర్తీ చేశాను కాని ఆస్తులు అమ్మాల్సిన అవసరం రాలేదు అంటూ పేర్కొన్నాడు.

నాన్నగారు స్థాపించిన కోదండపాణి స్టూడియోస్‌ ను తీసేయడం వల్ల అసలు ఈ ప్రచారం మొదలు అయ్యిందని అన్నాడు. ఒకప్పుడు సంగీత దర్శకులు ఎక్కువగా కోదండపాణి స్టూడియోకు వచ్చే వారు. కాని ప్రముఖ సంగీత దర్శకులు అంతా కూడా ఎవరికి వారు సొంతంగానే స్టూడియోలు ఏర్పాటు చేసుకున్నారు. దాంతో నాన్నగారు కోదండపాణి స్టూడియోను తొలగించినట్లుగా పేర్కొన్నాడు. స్టూడియో తొలగించిన సమయంలో అందులోని ఉద్యోగస్తులను తామే వేరే చోట ఉద్యోగాలకు పెట్టించాము. ఆ తర్వాత స్టూడియో సామాగ్రీని జెమిని స్టూడియో వారికి అప్పగించడం జరిగింది. అలా స్టూడియోను తొలగించడం వల్ల అమ్మేసినట్లుగా ప్రచారం చేశారు. స్టూడియో లో రికార్డింగ్‌ లు తగ్గిన కారణంగానే తొలగించాల్సి వచ్చింది తప్ప ఆర్థికంగా నష్టాల వల్ల కాదని స్పష్టంగా చెప్పేశాడు.

ఇక తన సినిమాలు వసూళ్ల పరంగా నిరాశ పర్చినప్పటికి కొన్ని జాతీయ అవార్డును తీసుకు రావడం.. అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ లో ప్రదర్శించడం జరిగిందని అన్నాడు. మళ్లీ సినిమాల నిర్మాణంపై ఆసక్తి ఉందా అన్న ప్రశ్నకు మంచి కథలతో వస్తే తప్పకుండా మళ్లీ సినిమాలను నిర్మిస్తానంటూ ప్రకటించాడు. ఇదే సమయంలో సినిమాలతో పాటు స్టేజ్‌ షో లను కూడా కొనసాగిస్తానంటూ పేర్కొన్నాడు. ఇక ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు సుదీర్ఘ కాలంగా కొనసాగించిన పాడుతా తీయగా షోను తాను టేకోవర్‌ చేయబోతున్నట్లుగా కూడా పేర్కొన్నాడు. ఈటీవీలో ప్రసారం కాబోతున్న కొత్త సీజన్‌ పాడుతా తీయగకు సంబంధించిన వివరాలు త్వరలో వెళ్లడిస్తానంటూ కూడా ఆయన పేర్కొన్నాడు. సింగర్‌ గా ఎంతో మందిని ఆ షో తో బాలు గారు పరిచయం చేశారు. ఇప్పుడు ఆ షోను చరణ్‌ చేస్తే ప్రేక్షకుల నుండి స్పందన ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఆ షో ను ఎంతో పద్దతిగా హుందాగా బాలుగారు నిర్వహించి ఒక మంచి పేరును తెచ్చి పెట్టారు. ఆ స్థాయిలో చరణ్‌ నిర్వహించగలడా అనేది చూడాలి.