Begin typing your search above and press return to search.

సింగ‌ర్ల‌కు 2కోట్లు పంచేశార‌ట‌!

By:  Tupaki Desk   |   8 Aug 2018 5:13 PM GMT
సింగ‌ర్ల‌కు 2కోట్లు పంచేశార‌ట‌!
X
గాయ‌నీగాయ‌కుల‌కు - సంగీత ద‌ర్శ‌కుల‌కు రాయ‌ల్టీ రావ‌డం అన్న మాట ఇంత‌వ‌ర‌కూ పెద్దంత‌గా విన‌నిది. సినిమాల‌కు - బుల్లితెర కార్య‌క్ర‌మాల‌కు వెళ్లి పాడితే చాలు పారితోషికాలు అందుతాయ‌ని తెలుసు. విదేశాల్లో స్టేజీ షోలు - కాన్సెర్టులు అంటూ సంపాదించుకుంటారు. ఇంకా రాయ‌ల్టీ ఏంటి? ఈ పాయింట్‌పైనే చ‌ర్చించేందుకు నేడు హైదరాబాద్ తాజ్‌ కృష్ణ‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ప‌లు ఆస‌క్తిక‌ర సంగుతుల్ని రివీల్ చేశారు.

సింగ‌ర్లు షోల‌కు వెళ్లి వ‌స్తే చాలు.. పాట‌కు ద‌క్కే పారితోషికంతో పాటు.. ఆ త‌ర్వాత అనాయాస‌ రాయ‌ల్టీలు ద‌క్కుతాయ‌న్న సంగ‌తిని రివీల్ చేశారు. 2012లో రాయ‌ల్టీ గురించి పార్ల‌మెంట్‌ లో బిల్లు పాస్ అయ్యాక అంతా సింగ‌ర్ల సీన్ మారింది. ఆ త‌ర్వాత రాయ‌ల్టీల రూపంలో అద‌న‌పు మొత్తం అందుతోంద‌ని సీనియ‌ర్ గాయ‌కుడు ఎస్‌.పి.బాల సుబ్ర‌మ‌ణ్యం తెలిపారు. ఈ బిల్లుకు ముందు అస‌లు త‌న‌కు ఎలాంటి రాయ‌ల్టీ ముట్టేది కాద‌ని అన్నారు. రాయ‌ల్టీ అనేది సింగ‌ర్స్ హ‌క్కు. దీని కోస‌మే ఆల్ ఇండియా సింగ‌ర్స్ అసోసియేష‌న్ (ఇస్రా) కృషి చేస్తోంది. అర్హులంద‌రూ ఇస్రాలో స‌భ్యులుగా చేరండి. ఏదైనా ఒక పాట పాడిన వారు రూ.2వేలు క‌ట్టి ఇందులో స‌భ్య‌త్వం తీసుకోవ‌చ్చు. ఇప్ప‌టికి 410 మంది స‌భ్యులున్నారు. భ‌విష్య‌త్తులో ఈ సంఖ్య అపారంగా పెరుగ‌నుంది. గాయ‌నీగాయ‌కుల‌కు భాష‌తో సంబంధం లేదు. అన్నిచోట్ల నుంచి రాయ‌ల్టీలు పొంద‌వ‌చ్చు.. అని తెలిపారు. అంటే దీనుద్ధేశం గాయ‌నీగాయ‌కులు పాడిన పాట‌ను - లేదా కంపోజర్ కంపోజింగ్‌ను నిర్ధేశించిన భాష‌లో కాకుండా ఇత‌ర‌త్రా భాష‌ల్లో ఉపయోగించ‌కుని ఆర్జించిన‌ట్ట‌యితే, అందులో వాటాను స‌ద‌రు గాయ‌నీగాయ‌కులు - సంగీత ద‌ర్శ‌కుల‌కు నిర్మాత‌లు విధిగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఒప్పందాల‌తో అస్స‌లు సంబంధ‌మే లేద‌ని ఆయ‌న క్లారిటీనిచ్చారు.

ఇలా ఇప్ప‌టికే బోలెడ‌న్ని రాయ‌ల్టీల్ని ఇస్రా వ‌సూలు చేసింది. సింగర్ల రాయ‌ల్టీపై తాజ్ కృష్ణ అవ‌గాహ‌న స‌ద‌స్సులో ఇస్రా బోర్డ్ స‌ల‌హాదారు సంజ‌య్ టాండ‌న్ మాట్లాడుతూ .. 2016లో రూ.51లక్షల రూపాయలను వసూలు చేసి అందరికీ పంచిపెట్టాం. 2017లో రూ.1.2కోట్లను వసూలు చేసి పంచామ‌ని తెలిపారు. ఇంట్రెస్టింగ్‌. సింగ‌ర్ల‌కు ఇదో ఆయాచిత వ‌రం అనే చెప్పాలి. అడ‌క్కుండా అమ్మ‌యినా పెట్ట‌దు. అయితే ఎవ‌రికి రావాల్సిన వాళ్లు రాబ‌ట్టుకునే తెలివితేట‌లు ఉంటే సింగ‌ర్లు ఇంకా ఇంకా అద‌నంగా గుంజుకోవ‌చ్చ‌న్న‌మాట‌. సింగ‌ర్లు - సంగీత ద‌ర్శ‌కులు - లిరిస్టులు ఈ రాయ‌ల్టీ విభాగంలోకే వ‌స్తారు. నిర్మాత‌ల నుంచి అద‌న‌పు మొత్తాల్ని అందుకునే ఛాన్సుంటుంద‌న్న‌మాట‌!