Begin typing your search above and press return to search.

రాజా బాలు కలిసిపోయారా?

By:  Tupaki Desk   |   5 Jun 2018 7:58 AM GMT
రాజా బాలు కలిసిపోయారా?
X
తెలుగులోనే కాదు యావత్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఇళయరాజా సంగీత ప్రస్థానం గురించి తెలియని సినిమా ప్రేమికుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. కానీ ఎస్పి బాలసుబ్రమణ్యం గాత్రం లేకుండా ఆయన జర్నీని మనం ఊహించుకోలేం. పాతికేళ్లకు పైగా తెలుగు తమిళ సినీ రంగాన్ని తమ కాంబోతో ఉర్రూతలూగించిన రాజా బాలు బయట పాటలు పాడే విషయంలో రాయల్టీ చెల్లించాల్సిన విషయమై విభేదాలు కొని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అదంతా గతం. జరిగి నెలలు గడుస్తున్నా అది గుర్తొచ్చినప్పుడంతా ఇద్దరి అభిమానుల మనసు చివుక్కుమంటుంది. కొంత కాలం బాలు ఇళయరాజా పాటలు బయట పాడటం మానేశారు. ఇళయరాజా పోయిన నవంబర్ లో హైదరాబాద్ వేదికగా లైవ్ కన్సర్ట్ చేస్తే బాలు లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఇది ఇప్పుడు కొంత సద్దుమణిగినట్టే కనిపిస్తోంది. తన పుట్టిన రోజు సందర్బంగా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.

రాజాతో తనకు విభేదాలు ఆ ఒక్క విషయంలోనే వచ్చాయని అలా రాయల్టీ అడగటం తనకు బాధగా అనిపించినా గత రెండు నెలల నుంచి రాజా పాటలు ఎక్కడ పాడినా దానికి సంబంధించిన రాయల్టీ రాజాకు పంపుతున్నట్టు స్పష్టం చేసారు. కానీ ఆ చర్య వల్ల మనసు గాయపడటం చూచాయగా ఒప్పుకున్నారు. ఇదిలా ఉండగా ఇద్దరినీ ఒకే వేదికపై మరోసారి చూడాలని అభిమానులు కోరుతున్నారు. ఇద్దరు కలిసి పాడుతుంటే ఆ సంగమాన్ని చాలా సార్లు తనివితీరా ఆస్వాదించామని ఇప్పుడు హక్కులు పేమెంట్ అంటూ దూరం కావడం తమకు ఇష్టం లేదని అంటున్నారు. వారి కోరిక మన్నించి రాజా బాలు ఓసారి ఎక్కడైనా స్టేజి షేర్ చేసుకుంటే అంతకంటే కావలసింది ఏముంటుంది . కానీ బాలు మాటలు బట్టి చూస్తే అది ఇప్పట్లో జరిగేది కాదనిపిస్తున్నా అసాధ్యం అయితే కాదు.