Begin typing your search above and press return to search.

రాజకీయ నేతల దుమ్ముదులిపిన బాలు

By:  Tupaki Desk   |   31 Jan 2019 3:58 PM IST
రాజకీయ నేతల దుమ్ముదులిపిన బాలు
X
గాన గంధర్వుడు.. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన మనోవేదనను ఓ సభలో బయటపెట్టాడు. ప్రస్తుత రాజకీయాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. సహజంగా సినిమా రంగంలో ఉన్న వాళ్లు రాజకీయాలపై మాట్లాడడానికి భయపడుతారు. ప్రభుత్వంతో పెట్టుకుంటే తమ సినిమాలు, వ్యాపారాలకు ఇబ్బందులు వస్తాయని వెనుకంజ వేస్తారు. కానీ బాలు మాత్రం నిజాలను నిర్భయంగా చెప్పి సంచలనం సృష్టించాడు..

తిరుపతిలో జరిగిన ఓ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తాజాగా రాజకీయ నాయకుల తీరుపై విమర్శలు గుప్పించారు. ‘15 హత్యలు చేసి జైలుకెళ్లి 15 ఏళ్లు శిక్ష పూర్తికాకుండానే విడుదలైన ఓ వ్యక్తి రాజకీయాల్లో నానా పాట్లు పడి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి తనను అరెస్ట్ చేసిన పోలీసులతో సెల్యూట్ చేసుకునే దుస్థితి ప్రస్తుత రాజకీయాల్లో వచ్చింది’ అని బాలూ సంచలన కామెంట్స్ చేశారు.

పార్టీ ఫిరాయింపు దారులపై కూడా బాలు ఘాటుగా విమర్శించారు. ‘ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి వెళుతున్నారు. అసలు ఓటేసిన ప్రజల అనుమతి వీరికి అక్కర్లేదా’ అని బాలు ప్రశ్నించారు. అలాంటి నేతలకు ప్రజలు కూడా చప్పట్లతో స్వాగతం పలుకుతున్నారని బాలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే తాను సమాజ సృహ హితం కోసమే ఇలా మాట్లాడాను తప్పితే ఎవరినో టార్గెట్ చేయడానికి కాదు అని బాలు తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చాడు.