Begin typing your search above and press return to search.

సోనాలి పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు.. మర్డర్ ఆరోపణలతో ఇద్దరు అరెస్ట్..!

By:  Tupaki Desk   |   26 Aug 2022 3:55 AM GMT
సోనాలి పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు.. మర్డర్ ఆరోపణలతో ఇద్దరు అరెస్ట్..!
X
బిగ్ బాస్ ఫేమ్, టిక్ టాక్ స్టార్, బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతి కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఆమె గుండెపోటుతో మరణించిందని గోవా పోలీసులు మరియు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ.. పోస్ట్ మార్టం రిపోర్ట్ తో అది ఇప్పుడు మర్డర్ కేసుగా మారింది.

సోనాలి ఫోగట్ ది హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు గోవా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. పోస్టుమార్టం నివేదికలో దిగ్భ్రాంతి కలిగించే వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె శరీరంపై మొద్దుబారిన గాయాలు ఉన్నట్లు తేలడంతో పోలీసులు హత్యా నేరం కింద కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో గోవాలో సోనాలి ఫోగట్ తో పాటు ఉన్న ఆమె మేనేజర్ సుధీర్ సగ్వాన్ మరియు స్నేహితుడు సుఖ్ విందర్ వాసీ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోనాలి సోదరుడి ఫిర్యాదుతో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.

కాగా, ఆగస్టు 22న గోవాకు వచ్చిన సోనాలి ఫోగట్ ఆరోగ్యం క్షిణించిందంటూ 23వ తేదీన అంజునా ప్రాంతంలోని ఓ ఆసుప్రతిలో చేర్చారు. సోనాలి శరీరంపై బాహ్య గాయాల గుర్తులు లేకపోవడంతో గుండెపోటు కారణంగా మృతి చెంది ఉండవచ్చని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు.

అయితే మంగళవారం రాత్రికి గోవా చేరుకున్న సోనాలి ఫోగట్ సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు.. ఆమె హార్ట్ ఎటాక్ తో చనిపోలేదని.. ఇద్దరు వ్యక్తులు కలిసి హత్య చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు సోనాలి సోదరుడు రింకూ ధాకా బుధవారం గోవా పోలీసులకు కంప్లైంట్ చేశాడు.

అలాగే తమ సోదరికి గోవాలో పోస్టు మార్టం వద్దని.. ఢిల్లీ లేదా జైపూర్ ఎయిమ్స్ లో శవ పరీక్ష నిర్వహించాలని కోరాడు. అయితే పోలీసులు మాత్రం గోవాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించడానికి అంగీకరించారు. ఈ రిపోర్ట్ లో ఆమె శరీరంపై గాయాలు ఉన్నట్లు తేలడంతో మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గోవాలో సోనాలి ఫోగట్ తో పాటు సుధీర్ సగ్వాన్ - సుఖ్ విందర్ వాసీలు ఉన్నారని.. వారితో తనకు ప్రమాదం ఉన్నట్లు కుటుంబ సభ్యులకు ముందురోజు చెప్పినట్లు మృతురాలి సోదరుడు రింకూ చెప్పడంతో సోనాలి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన సోదరిని వారిద్దరూ రేప్ చేసి హత్య చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అసభ్యకరమైన వీడియోతో సోనాలి ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. ఆమె కెరీర్ ను నాశనం చేస్తున్నారని బెదిరించినట్లు రింకూ ధాకా ఆరోపించాడు. సోనాలి మరణం తర్వాత ఆమె ఫామ్ హౌస్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలు - ఫోన్లు - ల్యాప్ ట్యాప్ లు మాయమయ్యాయని తెలిపాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన సోనాలి ఫోగట్.. బీజేపీలో చేరడానికి ముందు 2006లో టీవీ యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. 2019 హర్యానా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా అడంపూర్ నుంచి బరిలో దిగింది. ఇక బిగ్ బాస్ 14 రియాలిటీ షోలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేసింది.

సోనాలికి యశోధర ఫోగట్ అనే 15 ఏళ్ల కూతురు ఉంది. ఆమె భర్త సంజయ్ ఫోగట్ 2016లో తమ ఫామ్ హౌస్ లో అనుమానాస్పదరీతిలో కన్నుమూశారు. ఇప్పుడు సోనాలి కూడా అనుమాస్పదంగా మరణించింది. తన తల్లికి న్యాయం జరగాలని సోనాలి కుమార్తె యశోధర డిమాండ్ చేస్తోంది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.