Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ మూవీతో సొనాలీ బింద్రే రీ ఎంట్రీ!

By:  Tupaki Desk   |   10 May 2022 2:30 PM GMT
ఎన్టీఆర్ మూవీతో సొనాలీ బింద్రే రీ ఎంట్రీ!
X
సొనాలి బింద్రే .. అందానికే అందం అనడానికి ఈ పేరును చెప్పుకుంటారు. వెండితెరను ఏలేసిన సౌందర్య శిల్పం ఆమె. ఏ వంక నుంచి చూసినా ఎలాంటి వంకాలేని అందాల చందమామ ఆమె. బాలీవుడ్ లో అలాంటి బ్యూటీ లేదనే వారు చాలామంది ఉన్నారు. మోడలింగ్ లోను అలాంటి మెరుపును చూడలేదనేవారు ఉన్నారు. బాలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె బాగా చేరువైంది. కాడమల్లె పూవులాంటి ఈ సుందరికి కళ్లు అప్పగించేసి కూర్చున్నవారే ఎక్కువ. ఆమె అందానికి ఆగకుండా నీరాజనాలు పట్టినవారే ఎక్కువ.

తెలుగులో ఆమె 'మురారి' సినిమాతో పరిచయమైంది. ఇక ఆ తరువాత మన్మథుడు .. ఖడ్గం .. ఇంద్ర .. శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి భారీ విజయాలను ఆమె సొంతం చేసుకుంది. తొలి సినిమాతో ఆమె ఎలాంటి గ్లామర్ తో ఆకట్టుకుందో .. బ్రేక్ తీసుకునేవరకూ అంతే గ్లామర్ తో అలరించింది.

అలా హ్యాపీగా ఆమె లైఫ్ సాగిపోతున్న సమయంలోనే కేన్సర్ బారిన పడటం జరిగింది. ఆ సమయంలో మానసికంగా ఆమె తనని తాను బలోపేతం చేసుకోవడం వలన ఆ గండం నుంచి గట్టెక్కింది. అంతటి ప్రాణాపాయం నుంచి ఆమె బయటపడటంతో అభిమానులంతా తేలికగా ఊపిరి పీల్చుకున్నారు.

ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుంది. అందువలన ఆమెను వెదుకుతూ మళ్లీ అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు నుంచి కూడా ఒక అవకాశం వెళ్లినట్టుగా తెలుస్తోంది. కొరటాల తన తదుపరి సినిమాను ఎన్టీఆర్ తో చేయడానికి రెడీ అవుతున్నాడు.

రేపో మాపో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా అలియా .. జాన్వీ కపూర్ వంటి కథానాయికల పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరిని ఖరారు చేస్తారనే విషయంలో స్పష్టత రావలసి ఉంది.

త్రివిక్రమ్ మాదిరిగానే ముఖ్యమైన పాత్రలకి సీనియర్ హీరోయిన్స్ ను తీసుకునే అలవాటు కొరటాలకి ఉంది. ఆయన గత చిత్రాలను పరిశీలన చేస్తే ఈ విషయం అర్థమవుతుంది. అలాగే ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రకి గాను సొనాలిని సంప్రదించారట. కథ .. తన పాత్ర విన్న తరువాత ఆమె పాజిటివ్ గానే స్పందించిందట. త్వరలోనే తన నిర్ణయాన్ని చెప్పచ్చని అంటున్నారు. ఈ సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయమేననే టాక్ మాత్రం బలంగానే వినిపిస్తోంది మరి!