Begin typing your search above and press return to search.

సోనాలీ...విగ్, వీల్ చైర్ ఎందుకు వద్దనుకుంది?

By:  Tupaki Desk   |   12 March 2020 5:26 PM GMT
సోనాలీ...విగ్, వీల్ చైర్ ఎందుకు వద్దనుకుంది?
X
బాలీవుడ్ నటి సోనాలీ బెంద్రేకి గత ఏడాది జులైలో మెటాస్టాటిక్ క్యాన్సర్ ఉందని నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. 8 నెలలపాటు న్యూయార్క్ లో చికిత్స తీసుకున్న సోనాలి క్యాన్సర్ ను జయించింది. క్యాన్సర్ తో తాను చేసిన పోరాటాన్ని ఎప్పటికపుడు అభిమానుల తో సోషల్ మీడియా ద్వారా సోనాలీ పంచుకుంటోంది. ఆ వ్యాధికి గురైన అనేక మందికి బలం, ప్రేరణ ఇవ్వాలన్నదే సోనాలీ ఉద్దేశ్యం. అయితే, క్యాన్సర్ కోసం కీమో థెరపీ చేయించుకున్న తర్వాత సోనాలీ విగ్ పెట్టుకోలేదు. ఆ మాటకొస్తే అసలు వీల్ చైర్ లో కూడా కూర్చోలేదు. తాను విగ్, వీల్ చైర్ లను వద్దనుకోవడానికి గల కారణాలను సోనాలీ ఓ షోలో రివీల్ చేసింది. కరీనా కపూర్ నిర్వహిస్తోన్న రేడియో షో లో పాల్గొన్న సోనాలీ క్యాన్సర్ తో తన యుద్ధం గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

సాధారణంగా హీరోయిన్లు అందంగా ఉండేందుకు ఇష్టపడతారు. ఆ అందం పెంచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నా సరే....ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పేందుకు సాహసించరు. ఒక వేళ చిన్న దెబ్బ తగిలినా....అనారోగ్యం బారిన పడ్డా...ఆ అనారోగ్యం తాలూకు ఆనవాళ్లు కనిపించకుండా జాగ్రత్తపడతారు. అయితే, క్యాన్సర్ బారిన పడి కీమో థెరపీ వల్ల గుండు కొట్టించుకున్న సోనాలీ మాత్రం ఇందుకు మినహాయింపు. కొద్ది రోజుల క్రితం వోగ్ ఇండియా మ్యాగజైన్ కోసం ఎలాంటి మేకప్ వేసుకోకుండా ఫోటో షూట్ లో సోనాలి పాల్గొంది. క్యాన్సర్ శస్త్రచికిత్స కోసం పొట్ట భాగంలో 20-అంగుళాల పొడవైన సర్జరీ మచ్చ, తన హెయిర్ స్టైల్ కూడా దాచిపెట్టకుండా ఫోటో షూట్ లో ప్రదర్శించింది. అందుకు గల కారణాలను ఈ షోలో సోనాలీ చెప్పింది.

ఎప్పుడు కొత్తగా ఉండడానికి సహజత్వాన్ని ఎంచుకోవాలని, మన సహజత్వం మనకు స్వేచ్ఛనిస్తుందని సోనాలీ చెప్పింది. మన లో ఉండే లోపాలను ఎవరికి కనబడకుండా దాచి పెట్టాలని చూసే క్రమంలో ఇబ్బంది పడే బదులుగా తమ సహజత్వం ఇది అని చెప్పాలంటోంది సోనాలి. కీమో తర్వాత తన కోసం విగ్, వీల్ చైర్ రెడీగా ఉన్నాయని...అయితే, తనకు వీల్ చైర్ లో కూర్చోవడం ఇష్టం లేదని.... తాను వాటిని వద్దనుకున్నానని సోనాలి చెప్పింది. తాను గుండు చేయించుకొని ఎలా ఉన్నానో...అలాగే బయటప్రపంచానికీ అలాగే కనిపించాలని అనుకున్నానని తెలిపింది.

కుటుంబానికి....స్నేహితులకు దూరంగా న్యూాయార్క్ కు చికిత్స కోసం వెళ్లడం కూడా తనకు ఇష్టం లేదని...తన భర్త మాట కాదనలేక అక్కడికి వెళ్లానని చెప్పింది. ఫ్లయిట్ లో తన భర్తతో గొడవపడుతూనే ఉన్నానని....అప్పుడు తనవ్యాధి తీవ్రత గురించి తనకు తెలిసిందని చెప్పింది.