Begin typing your search above and press return to search.

నాగ్ దార్లోకి వ‌చ్చాడు.. బాల‌య్య ఎప్పుడో!

By:  Tupaki Desk   |   23 Jan 2016 3:30 AM GMT
నాగ్ దార్లోకి వ‌చ్చాడు.. బాల‌య్య ఎప్పుడో!
X
ఇటీవ‌లి కాలంలో తెలుగు సినిమాల భ‌విష్య‌త్తుని ఓవ‌ర్సీస్ క‌లెక్ష‌న్లు ప్ర‌భావితం చేస్తున్నాయి. అక్క‌డున్న ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తే చాలు... సినిమాలు దాదాపుగా గ‌ట్టెక్కిన‌ట్టే అని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌గ‌డుతున్నాయి. ఒక‌ప్పుడు మ‌న‌కు నైజామ్ క‌లెక్ష‌న్లే కీల‌కంగా క‌నిపించేవి. కానీ ఇటీవ‌ల కాలంలో నైజామ్‌ కంటే ఎక్కువ క‌లెక్ష‌న్లు ఓవ‌ర్సీస్ నుంచి వ‌స్తున్నాయి. అందుకే క‌థానాయ‌కులు త‌మ త‌మ సినిమాల్లో ఓవ‌ర్సీస్ ప్రేక్ష‌కుల్ని అల‌రించే సినిమాలేమున్నాయా అని ఒక‌టికి రెండుమార్లు చూసుకొంటున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. యువ క‌థానాయ‌కుల‌కి ఓవ‌ర్సీస్‌లో తిరుగులేదు కానీ... సీనియ‌ర్ హీరోల సినిమాలకే అక్క‌డ ప‌ప్పులు ఉడక‌డం లేదు. అందుకే కొంత‌కాలంగా సీనియ‌ర్లు కూడా ఓవ‌ర్సీస్ మార్కెట్‌ లో ఎలాగైనా త‌మ హ‌వా చూపించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఆ ప్ర‌య‌త్నంలో నాగార్జున మంచి ఫ‌లితాల్నే సొంతం చేసుకున్నాడు కానీ... బాల‌య్య మాత్రం త‌న హ‌వా చూపించ‌లేక‌పోయాడు. నాగార్జున త‌న సోగ్గాడే చిన్నినాయ‌నా చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్‌ కృష్ణ‌తో క‌లిసి చేశాడు. క‌ళ్యాణ్ యువ ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి అందులో మాంచి రొమాంటిక్ అంశాల్ని జోడించాడు. న‌వ‌త‌రాన్నీ అల‌రించేలా సినిమాని తీర్చిదిద్దాడు. దీంతో ఆ చిత్రం ఓవ‌ర్సీస్‌ లో అద‌ర‌గొడుతోంది. 80 సెంట‌ర్ల‌లోనే విడుద‌లైనా మంచి వ‌సూళ్ల‌ని సొంతం చేసుకుంది. ఇదివ‌ర‌కు నాగార్జున న‌టించిన ఏ సినిమా కూడా ఓవ‌ర్సీస్‌ లో ఇంత‌గా ఆడింది లేదు. అయితే త‌న తోటి క‌థానాయ‌కుడైన బాల‌య్య మేజిక్ మాత్రం అక్క‌డ అంత‌గా ప‌నిచేయ‌డం లేదు. డిక్టేట‌ర్‌ ని కూడా శ్రీవాస్‌ లాంటి యువ ద‌ర్శ‌కుడే తీశాడు. ఆ సినిమా కూడా క్లాస్‌ గానే ఉంటుంది కానీ... ఓవ‌ర్సీస్ జ‌నాలు మాత్రం నాన్న‌కు ప్రేమ‌తో - సోగ్గాడే చిన్నినాయ‌నా చిత్రాల్ని ఆద‌రిస్తున్నంత‌గా బాల‌య్య సినిమాని ఆద‌రించ‌డం లేదు. దీంతో బాల‌య్యకి మరోమారు లోక‌ల్ మార్కెట్‌ పైనే ఆధార‌ప‌డాల్సి వ‌చ్చింది.