Begin typing your search above and press return to search.

తెలుగ‌మ్మాయి `గూఢ‌చారి`తో వ‌చ్చేస్తోంది

By:  Tupaki Desk   |   3 Nov 2016 10:30 PM GMT
తెలుగ‌మ్మాయి `గూఢ‌చారి`తో వ‌చ్చేస్తోంది
X
శోభిత దూళిపాళ్ల‌... ఈ పేరు విన‌ని వాళ్లంటూ ఉండ‌రేమో. 2013లో మిస్ ఇండియా ఎర్త్‌ గా ఎంపికై అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అంతే కాదు... అప్ప‌ట్నుంచి గ్లామ‌ర్ ప్ర‌పంచాన్ని ఓ ఊపు ఊపేస్తోంది. ఎక్క‌డికెళ్లినా త‌న అందంతో టైటిళ్ల‌ని ఎగ‌రేసుకొని వ‌స్తోంది. ఒక తెలుగ‌మ్మాయి ఈరేంజ్‌లో గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. 2014లో కింగ్ ఫిష‌ర్ క్యాలెండ‌ర్‌ కి కూడా ఎక్కింది. ఆ క్యాలెండ‌ర్ కోసం ఇచ్చిన హాట్ హాట్ పోజుల్ని చూసి తెలుగ‌మ్మాయా మ‌జాకా అన్నారంతా. తెనాలిలో పుట్టి పెరిగిన శోభిత కొంత‌కాలంగా బాలీవుడ్‌ లో కెరీర్‌ ని నిర్మించుకొనే ప్ర‌య‌త్నాల్లో ఉంది. అనురాగ్ క‌శ్య‌ప్ సినిమా రామ‌న్ రాఘ‌వ్ 2.0 సినిమాతో ప‌రిచ‌య‌మైంది కానీ ఆ చిత్రంతో పెద్ద‌గా గుర్తింపేమీ రాలేదు.

ఇటీవ‌ల మ‌రో హిందీ చిత్రంలో నటించేందుకు ఒప్పుకొంది. శోభిత గ్లామ‌ర్ ప్ర‌పంచంలోకి అడుగుపెట్టిన తొలినాళ్ల‌నుంచీ తెలుగులో కూడా న‌టించేందుకు ఆస‌క్తి చూపుతోంది కానీ... మ‌న ఇండ‌స్ట్రీనే ఆమెని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఆమ‌ధ్య మ‌హేష్ సినిమా కోసం ప‌రిశీల‌న‌లో ఉంద‌ని ప్ర‌చారం సాగింది కానీ... అది నిజం కాలేదు. అయితే ఎట్ట‌కేల‌కి శోభిత తెలుగులో ఓ అవ‌కాశాన్ని చేజిక్కించుకొంది. అడ‌వి శేష్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్క‌నున్న గూఢ‌చారి సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. అభిషేక్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న ఆ సినిమా చిత్రీక‌ర‌ణ ఈ రోజే మొద‌లైంది. శోభిత ఎంట్రీ ఇచ్చింది కాబ‌ట్టి తెలుగులో మ‌రిన్ని అవ‌కాశాలు ఆమె త‌లుపు త‌ట్టొచ్చేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/