Begin typing your search above and press return to search.

శోభ‌న్ ‌బాబుః తెరపై వెలిగాడు.. జీవితంలో గెలిచాడు!

By:  Tupaki Desk   |   20 March 2021 6:30 AM GMT
శోభ‌న్ ‌బాబుః తెరపై వెలిగాడు.. జీవితంలో గెలిచాడు!
X
జీవిత పరమార్థం ఏంటీ..? ప్రశ్న చాలా చిన్నది. సమాధానం కూడా అంత‌క‌న్నా చిన్నదే. కానీ.. దాన్ని దొరకబట్టడానికి అనంతాన్ని అన్వేషించాలి. అన్ని అంశాల‌నూ ఔపోస‌న ప‌ట్టాలి. అప్పుడు లభిస్తుంది ఆ ప్ర‌శ్న‌కు ఆన్సర్.. ‘ఆనందం’ అని! అవును.. జీవితానికి అర్థం ఇదే! రావ‌డం.. పోవ‌డం అనివార్య‌మైన ఈ జీవిత ప్ర‌యాణంలో.. ఎంత సంతోషంగా జ‌ర్నీ చేశావ‌న్న‌దే అంతిమం! ఈ స‌మాధానం తెలిసిన‌వారు బ‌హుకొద్ది మంది. అందులో ముందువ‌ర‌స‌లో ఉండే ప్ర‌ముఖులు శోభ‌న్ బాబు!

ఆయ‌న జీవితాన్ని ఎంత అద్భుతంగా ఊహించి.. ఎంత చ‌క్క‌గా ప్లాన్ చేసుకున్నారో వింటే అబ్బురప‌డాల్సిందే. తెలుసుకుంటే.. ఆశ్చ‌ర్యం చెందాల్సిందే. బ‌త‌క‌డానికి ఓ ప‌నిచేయాలి. ఆ ప‌నిచేస్తూ కుటుంబాన్ని పోషించాలి.. ఈ రెండూ చేస్తూ జీవితాన్ని ఆస్వాదించాలి. ఈ సింపుల్ సూత్రాన్ని త‌న‌కు అప్లై చేసుకున్న సోగ్గాడు.. ప‌క్కాగా లైఫ్ ను ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నారు.

ఏది ద‌గ్గ‌రికి రావాలో అదే రానిచ్చారు.. దేన్ని దూరం పెట్టాలో దాన్ని అక్క‌డే ఉంచారు. తెలుగు తెర‌పై వెలుగు వెలిగిన అల‌నాటి హీరోల్లో ముందు వ‌ర‌స‌లో ఉన్నారు శోభ‌న్ బాబు. కానీ.. ఏనాడూ ఆ స్టార్ డ‌మ్ ను త‌ల‌కెక్కించుకోలేదు. ఎందుకంటే.. అది శాశ్వ‌తం కా‌దు కాబ‌ట్టి. వేడి ఉన్నంత వ‌ర‌కు నిప్పు మండుతుంది.. ఆ తర్వాత చ‌ల్ల‌బ‌డుతుంద‌ని గుర్తించారు కాబ‌ట్టి. ఆ వేడిలో ప‌డి మిగిలిన జీవితాన్ని బూడిద కానివ్వొద్ద‌ని నిర్ణ‌యించుకున్నారు కాబ‌ట్టి! అందుకే.. ఆయ‌న సినిమా కెరీర్ కు, జీవితానికి స‌మ ప్రాధాన్యం ఇచ్చారు.

రోజుకు ఎనిమిది గంట‌ల డ్యూటీ మాదిరిగా.. ఆయ‌న సినిమా షెడ్యూల్ ఉండేది. ఉద్యోగి మాదిరిగానే ఆయ‌న కాల్షీట్లో వారాంతంపు సెల‌వు ఉండేది. అదే స‌మ‌యంలో ఎప్పుడో ఒక‌టీ అరా ఓటీలు చేశారేమోగానీ.. ఖ‌చ్చిత‌మైన డ్యూటీ టైమింగ్స్ ను పాటించారు. సాయంత్రం 6 దాటితే సెట్స్ నుంచి వెళ్లిపోయేవారు. ఎందుకంటే.. ఇది సినిమా, అవ‌త‌ల జీవితం ఎదురుచూస్తోంది!

1959లో చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యమైన శోభ‌న్ బాబు.. 96లో విడుదలైన ‘హ‌లోగురు’ చిత్రంతో నటనకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ గ్యాప్ లో 220 చిత్రాల్లో నటించారు. యావత్ తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. మహిళా ప్రేక్షకుల జేజేలు పొందారు. సాంఘికం నుంచి పౌరాణికం వరకూ అన్ని జోనర్లలోనూ నటించి, తిరుగులేదనిపించుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత రాముడు, కృష్ణుడిగా క‌నిపించి, మెప్పించారు. జీవితంలో డబ్బు విలువ తెలిసి భారీగా సంపాదించారు. వారసత్వానికి అప్పగించారు. కానీ.. సినీ రంగంపై మనసులో ఏదైనా అభిప్రాయం ఉందో.. వారసులకే ఇష్టం లేదోగానీ.. వారిపై ఇండస్ట్రీ నీడ కూడా పడనీయలేదు.

సినిమాల్లో ఇద్ద‌రు భార్య‌ల‌తో ఎక్కువ‌గా క‌నిపించిన శోభ‌న్ బాబు జీవితంలోకి కూడా ఇద్ద‌రు వ‌స్తారా? అనిపించింది అంద‌రికీ. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన జ‌య‌ల‌లిత.. ఆయ‌న‌ లైఫ్ లోకి వ‌స్తార‌నే ప్ర‌చారం గ‌ట్టిగానే సాగినా.. అది సినిమాకే ప‌రిమితం అనిపించారు ఆయ‌న‌. మొత్తంగా.. జీవితాన్ని ముందే ఊహించి, ప‌క్కాగా ప్లాన్ చేసి పెట్టుకొని మ‌రీ.. అనుకున్న, ఆశించిన జీవితాన్ని అనుభ‌వించారు. ఆ విధంగానే 2008లో ఈ లోకాన్ని వ‌దిలి వెళ్లిపోయారు. ఇవాళ శోభ‌న్ బాబు వ‌ర్ధంతి.. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ‘తుపాకీ’ నివాళి.