Begin typing your search above and press return to search.

చిన్న సినిమాలకు కలిసి వస్తున్న లాక్‌ డౌన్‌!

By:  Tupaki Desk   |   12 April 2020 11:30 PM GMT
చిన్న సినిమాలకు కలిసి వస్తున్న లాక్‌ డౌన్‌!
X
లాక్‌ డౌన్‌ తో దేశ వ్యాప్తంగా థియేటర్లు అన్ని కూడా మూతపడ్డాయి. కొత్త సినిమాలు విడుదల లేక పోవడంతో ప్రేక్షకులు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లను ఆశ్రయిస్తున్నారు. ఇంట్లోనే ఉంటున్న వారు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ కోసం ఓటీటీని ఆశ్రయిస్తున్నారు. తెలుగులో ప్రస్తుతం పలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లు ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో బిజినెస్‌ ప్రధానంగా ఉంది. తెలుగులో అత్యధిక బిజినెస్‌ ఉన్న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో చిన్నా పెద్ద సినిమాలు స్ట్రీమ్‌ అవుతున్నాయి.

పెద్ద సినిమాలను భారీ మొత్తాలకు కొనుగోలు చేసే అమెజాన్‌ ప్రైమ్‌ చిన్న సినిమాలకు మాత్రం షేరింగ్‌ విధానంలో స్ట్రీమ్‌ చేస్తూ ఉంటుంది. చిన్న సినిమాలను స్ట్రీమ్‌ చేయడంతో కొంత మొత్తంను తీసుకుని నిర్మాతలకు వ్యూ టైంను బట్టి షేర్‌ ను చెల్లిస్తారు. అలా ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా చిన్న సినిమాలు లక్ష నుండి లక్షన్నర వరకు ప్రతి రోజు రాబడుతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

పలాస.. రాజావారు రాణిగారు.. మధ చిత్రాలు ప్రస్తుతం అమెజాన్‌ లో తెగ హడావుడి చేస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని సినిమాలను కూడా ప్రేక్షకులు విపరీతంగా స్ట్రీమ్‌ చేస్తున్నారు. దాంతో నిర్మాతలకు రోజుకు లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుందని సమాచారం అందుతోంది. ఈ సమయంలో రోజుకు లక్ష ఆదాయం అంటే చాలా గొప్ప విషయం. చిన్న నిర్మాతలకు అమెజాన్‌ స్ట్రీమింగ్‌ లాభదాయకంగా మారింది. ముందు ముందు మరింతగా ఆదాయం వస్తుందని పెద్ద సినిమాలు కూడా ఇదే పద్దతిలో కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.