Begin typing your search above and press return to search.

శివాని మనసులు గెలుచుకుందిగా..

By:  Tupaki Desk   |   31 March 2018 4:25 AM GMT
శివాని మనసులు గెలుచుకుందిగా..
X
టాలీవుడ్ స్టార్ కిడ్స్ లో హీరోలు చాలామందే ఉన్నా హీరోయిన్లు మాత్రం చాలా తక్కువ. బాలీవుడ్ లో స్టార్ డాటర్స్ అంతా రాజ్యమేలేస్తున్నా ఇంకా టాలీవుడ్ మాత్రం ఈ విషయం ఇంకా చాలా వెనుకే ఉంది. ఇప్పుడిప్పుడే వాళ్లు కూడా తమ ప్రతిభ చాటాలని తెగ ఆరాటపడుతున్నారు. అలా తెరముందుకొస్తోంది హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని.

అడవి శేష్ హీరోగా నటిస్తున్న 2 స్టేట్స్ సినిమాతో శివాని వెండితెరకు పరిచయం అవుతోంది. ఈ సినిమా కోసం ఇటీవలే తన తొలి రెమ్యునరేషన్ అందుకుంది. జీవితంలో తొలి సంపాదన దాచుకోవడమో.. ఎంతో ఇష్టమైంది కొనుక్కోవడమో చేస్తారు. కానీ శివాని ఈ విషయంలో చాలా డిఫరెంట్ గా ఆలోచించింది. చదువుకు దూరమైపోతున్న పిల్లలకు సహాయం చేసేందుకు యాక్టర్ మంచులక్ష్మి నడుపుతున్న టీచ్ ఫర్ ఛేంజ్ సొసైటీ కోసం తన తొలి రెమ్యునరేషన్ మొత్తం ఖర్చు చేసింది. ‘‘నా తొలి సంపాదన పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు చేయడం చాలా ఆనందంగా ఉంది. నా సహాయం చిన్నదే అయినా నేను గర్వపడే పనిచేశానని చెప్పుకోగలను. మా అమ్మనాన్నల అడుగుజాడల్లో నడుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది.

హిందీలో సూపర్ హిట్టయిన 2 స్టేట్స్ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీ హిందీలో మంచి సక్సెస్ సాధించింది. 2 స్టేట్స్ సినిమాతో శివాని హీరోయిన్ గా ఏ మేరకు మెప్పిస్తుందో తెలియకపోయినా ఒక మంచి పని కోసం ముందడుగా వేసిన స్టార్ కిడ్ గా అందరి మనసులు గెలుచుకుంది.