Begin typing your search above and press return to search.

'డాన్' గా మారిన వరుణ్‌ డాక్టర్‌

By:  Tupaki Desk   |   11 Nov 2021 5:08 AM GMT
డాన్ గా మారిన వరుణ్‌ డాక్టర్‌
X
కింది స్థాయి నుండి వచ్చి నటుడిగా పరిచయం అయ్యి స్టార్‌ గా పేరు దక్కించుకున్న శివ కార్తికేయన్ మెల్ల మెల్లగా తన మార్కెట్ ను విస్తరించుకుంటున్నాడు. మొన్నటి వరకు కేవలం తమిళంలో మాత్రమే ఆయన సినిమాలు ఆడేవి. ఇటీవల ఆయన నటించిన డాక్టర్ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుని సెకండ్ వేవ్ తర్వాత మొదటి వంద కోట్ల సినిమాగా నిలిచిన విషయం తెల్సిందే. తమిళంలోనే కాకుండా తెలుగు లో కూడా వరుణ్‌ డాక్టర్ గా శివకార్తికేయన్ మంచి వసూళ్లను దక్కించుకున్నాడు. చిన్న బడ్జెట్‌ తో రూపొందిన డాక్టర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు శివ కార్తికేయన్ తదుపరి సినిమా విషయమై చర్చ మొదలు అయ్యింది.

కెరీర్‌ ఆరంభం నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను విడుదల చేసే శివ కార్తికేయన్‌ కరోనా కారణంగా కాస్త స్లో అయ్యాడు. అందరు హీరోల మాదిరిగానే ఆయన సినిమాలు కరోనా సమయంలో రాలేదు. ఎట్టకేలకు ఆయన సినిమాల సందడి మొదలు అయ్యింది. డాక్టర్ సినిమాకు వచ్చిన పాజిటివ్‌ రెస్పాన్స్ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా డాన్‌ ను స్పీడ్ గా ముగించే ప్రయత్నాలు చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్ టైనర్‌ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది. డాక్టర్ గా చాలా సీరియస్ పాత్రలో కనిపించిన శివ కార్తికేయన్‌ డాన్ గా చాలా జోవియల్‌ పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్‌ ను చూస్తుంటే అర్థం అవుతోంది.

టైటిల్ కు తగ్గట్లుగా కాకుండా విభిన్నంగా ఈ సినిమా ఉంటుందని అనిపిస్తుంది. హీరో డాన్ అంటే అదో పెద్ద మాఫియా నేపథ్యం సినిమా అనుకుంటారు. కాని ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ చూస్తుంటే మాత్రం అలా అనిపించడం లేదు అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో కూడా డాన్ ను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో శివ కార్తికేయన్ డైరెక్ట్‌ తెలుగు సినిమా రాబోతుంది. జాతి రత్నాలు సినిమా దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా ఒక భారీ మల్టీ లాంగ్వేజ్ మూవీ పట్టాలెక్కబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ ఇప్పటికే ప్రకటన వచ్చింది. డాన్ తర్వాత శివ కార్తికేయన్ జాతి రత్నాలు ఉంటుందేమో చూడాలి.