Begin typing your search above and press return to search.

అమ్మింది బంగ్లా కాదు డ‌బుల్ బెడ్రూమ్!-శివాజీ రాజా

By:  Tupaki Desk   |   9 Sep 2021 12:30 PM GMT
అమ్మింది బంగ్లా కాదు డ‌బుల్ బెడ్రూమ్!-శివాజీ రాజా
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల హంగామా చూస్తున్న‌దే. ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ మంచు విష్ణు వార్ కొన‌సాగుతోంది. ఇందులో ప్ర‌కాష్ రాజ్ త‌ర‌పున నాగ‌బాబు త‌న బాణీని బ‌లంగా వినిపిస్తుంటే ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఇంత‌కుముందు `మా` పాత ఆఫీస్ భ‌వంతిని ఎందుక‌ని అమ్మేశారు? అంటూ మోహ‌న్ బాబు ప్ర‌శ్నించ‌డంతో దానికి నాగ‌బాబు కౌంట‌ర్లు వేశారు. ఇదీ విష‌యం అంటూ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. శివాజీ రాజా అధ్య‌క్షుడిగా.. వీకే న‌రేష్ సెక్ర‌ట‌రీగా ఉన్న స‌మ‌యంలో 35ల‌క్ష‌ల‌కు కారు చౌక‌గా మా పాత ఆఫీస్ ని అమ్మార‌ని ఇప్పుడు దాని విలువ కోటి ఉంటుంద‌ని నాగబాబు తాజా ఇంట‌ర్వ్యూలో వివ‌ర‌ణ ఇచ్చారు. అంతేకాదు... మంచు విష్ణు కి అండ‌గా ఉన్న వీకే న‌రేష్ సెక్ర‌ట‌రీగా ఉన్న‌ప్పుడే అమ్మారు. ఆయ‌న‌నే వివ‌ర‌ణ అడ‌గాల్సిందిగా నాగ‌బాబు కోరారు.

తాజాగా దీనిపై `మా` మాజీ అధ్య‌క్షుడు శివాజీ రాజా స్పందించారు. అదేదో పెద్ద భ‌వంతిని అమ్మామ‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అమ్మింది బిల్డింగ్ కాదు డ‌బుల్ బెడ్రూమ్ అపార్ట్ మెంట్ మాత్ర‌మే. దీనిని అమ్మాల‌ని అప్ప‌ట్లో ప్ర‌క‌ట‌న ఇచ్చినా కొనేందుకు ఎవ‌రూ ముందుకు రాలేద‌ని దాంతో `మా` ఆఫీస్ కి సేవ‌లు చేసిన శ్రీ‌ధ‌ర్ అనే వ్య‌క్తికే అమ్మామ‌ని ఇప్పుడు ఆయ‌న ఆర్థిక ప‌రిస్థితి కూడా ఏమంత‌ బాగా లేద‌ని శివాజీ రాజా వివ‌ర‌ణ ఇచ్చారు.

పాత ఆఫీస్ క‌థాకామామీషు ఇదీ..!

`మా` ఎన్నికలు టాలీవుడ్ లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి తారల మధ్య జరిగే పోటీని ప్ర‌జ‌లు ఆసక్తిగా గమనించటం మొదట్నించి వస్తున్నదే. అయితే.. ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగితే మహా అయితే సింగిల్ కాలమ్.. లేదంటే డబుల్ కాలమ్ వార్తగా మిగిలిపోయేది. ఎప్పుడైతే ఎన్నికలు.. పోటీ జరుగుతుందో అప్పుడు చాలానే అంశాలు తెర మీదకు వస్తాయి. తాజాగా ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ప‌డిన వేళ మా గ‌త ఉదంతాలు ఒక్కొక్క‌టిగా తెర‌పైకొస్తున్నాయి.

ఇప్పటివరకు `మా` అసోసియేషన్ కు సరైన భవనం లేదని.. దాన్ని ఏర్పాటు చేసుకోలేదన్న విషయం ప్రతి ఎన్నికల సందర్భంలో చర్చకు వస్తుంది. ఒక దాని తర్వాత మరొక కార్యవర్గం మారినా.. మా అసోసియేషన్ బిల్డింగ్ కల మాత్రం మారదు. ఇదిలా ఉంటే.. గతంలో `మా` అసోసియేషన్ ఆఫీస్ కోసం ఒక సింగిల్ బెడ్రూం ప్లాట్ ను కొనుగోలు చేయటమే కాదు.. దాన్ని అమ్మేశార‌న్నది చాలా మందికి తెలీని ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. అంతేకాదు.. ఈ సందర్భంగా జరిగిన డీల్ పైనా ఇంత‌కుముందు కూడా మీడియాలో క‌థ‌నాలొచ్చాయి.

స‌ద‌రు క‌థ‌నం వెల్ల‌డించిన వివ‌రాల‌ మేర‌కు.. నాగబాబు `మా` అధ్యక్షుడిగా ఉన్న వేళ జూబ్లీహిల్స్ లోని ఒక ప్లాట్ ను రూ.45 లక్షలకు కొనుగోలు చేశారు. దానికి రూ.50 లక్షల ఖ‌ర్చుతో ఇంటీరియర్స్ చేయించార‌ట‌. అయితే.. ఈ ఫ్లాట్ కొనుగోలు చేసే సమయంలో ప్రముఖ సీనియర్ నటుడు మురళీ మోహన్ తీవ్రంగా వ్యతిరేకించార‌ని స‌ద‌రు క‌థ‌నం వెల్ల‌డించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం దాన్ని కొనుగోలు చేసారట‌. అయితే ఈ ప్లాట్ పక్కనే మురికి కాలువ ఉండటంతో ఆఫీసుకు రావటానికి ఎవరూ ఇష్టపడే వారు కాదు. దీంతో నెలకు రూ.10వేల చొప్పున అద్దెకు ఇచ్చారు.

ఈ ప్లాట్ వల్ల వచ్చే అద్దె కంటే కూడా దానికి అవుతున్న ఖర్చులు ఎక్కువ అని తేల‌డంతో శివాజీ రాజా తాను అధ్యక్షుడిగా ఉన్న టైమ్ లో ఈ భవనాన్ని రూ.34లక్షలకు అమ్మేశారు. అయితే అమ్మ‌కం ప్రాసెస్ లో కాస్త భిన్నంగా రిజిస్ట్రేషన్ ఖర్చును కొనేవాళ్లు కాకుండా `మా`నే భరించడం వివాదాస్ప‌ద‌మైంది. ఇంతకీ ఈ భవనాన్ని కొనుగోలు చేసింది ఎవరంటే.. `మా`కు డైరీలు ప్రింట్ చేసి ఇచ్చే వ్యక్తి అని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. అందుకే కోటి రూపాయిలు ఖర్చు పెట్టిన ప్లాట్ ను కారుచౌకగా రూ.34 లక్షలకు అమ్మేశారని స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది.

ఈ అమ్మకంపై ఇప్పుడు ఎన్నిక‌ల వేళ‌ కొత్త‌గా విమర్శలకు ఆస్కారం క‌ల్పించింది. పలువురు ఈ ఎపిసోడ్ ను తెరమీదకు తీసుకొచ్చి .. రూల్ పొజిషన్ ని చూస్తే.. బైలాస్ లో ఆస్తుల అమ్మకానికి సంబంధించి క్లాజ్ ఏదీ లేక‌పోవ‌డంపైనా చ‌ర్చిస్తున్నారు. దీంతో.. చట్టప్రకారం ఎలాంటి తప్పు లేనట్లే. కానీ.. ఎక్కువ విలువైన ఆస్తిని తక్కువ ధరకు అమ్మేయటంపైనా డిబేట్ జ‌ర‌గ‌నుంది.

నాగ‌బాబు హ‌యాంలో కొని శివాజీరాజా టర్మ్ లో అమ్మేయ‌డంతో దీనిపై ప్ర‌త్య‌ర్థులు ర‌చ్చ‌కు తెర తీస్తున్నారు. రూల్ ప్రకారం ఎలాంటి కేసులు శిక్షలు ఉండవు కానీ.. ఎక్కువ రేటుకు ఆస్తిని కొని తక్కువ ధరకు అమ్మటాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయం ఈ టాపిక్ వేడెక్కుతోంది. ప్ర‌స్తుత డిబేట్ కి గ‌తంలో వ‌చ్చిన క‌థ‌నాల‌పైనా నాగ‌బాబు .. శివాజీ రాజా ఇద్ద‌రూ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అక్టోబ‌ర్ 10న‌ మా అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌ర‌గనున్న నేప‌థ్యంలో ఇంకా ఇలాంటి వేడెక్కించే ఇత‌ర అంశాలు తెర‌పైకి రానున్నాయి.