Begin typing your search above and press return to search.

'శివాజీ' క‌న్నా ప్ర‌భుత్వం గొప్ప‌ది కాదు:క‌మ‌ల్‌

By:  Tupaki Desk   |   4 Aug 2017 6:03 PM GMT
శివాజీ క‌న్నా ప్ర‌భుత్వం గొప్ప‌ది కాదు:క‌మ‌ల్‌
X
గ‌త కొంత కాలంగా త‌మిళ‌నాడు స‌ర్కార్ పై విల‌క్ష‌ణ న‌టుడు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులోని కొన్ని స‌మ‌స్య‌ల‌పై క‌మ‌ల్ సోష‌ల్ మీడియాలో విరుచుకుప‌డుతున్నారు. కొంత‌మంది క‌మ‌ల్ అభిమానులు అంగ‌న్ వాడీ కేంద్రాల‌కు వెళ్లి అక్కడి ప‌రిస్థితుల గురించి క‌మ‌ల్ కు తెలియ‌జేశారు. దీంతో, అంగ‌న్ వాడీ కేంద్రాల్లో పిల్ల‌ల‌కు కుళ్లిపోయిన గుడ్లు పెడుతున్నార‌ని క‌మ‌ల్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా పోస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై జిల్లా అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న‌ అవినీతిపై మంత్రుల‌కు ఈ మెయిళ్లు పెట్టాల‌ని క‌మ‌ల్ త‌న అభిమానుల‌కు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్య‌ల అనంత‌రం క‌మ‌ల్ పై కొంద‌రు మంత్రులు ఎదురుదాడికి దిగిన సంగ‌తి తెలిసిందే. తాను రాజ‌కీయాల్లోకి రాబోతున్న‌ట్లు కూడా క‌మ‌ల్ ఓ క‌విత‌ను ట్వీట్ రూపంలో పోస్ట్ చేశారు. క‌మ‌ల్ రాజ‌కీయ ప్ర‌వేశంపై త‌మిళ‌నాడులో ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం పై క‌మ‌ల్ మ‌రోసారి విమ‌ర్శ‌లు చేశారు.

చెన్నైలోని మెరీనా బీచ్ తీరంలో ఉన్న త‌మిళ దిగ్గ‌జ న‌టుడు శివాజీ గణేశన్ విగ్రహాన్ని గురువారం తొల‌గించారు. దీనిపై కమల్ హాసన్ మండిపడుతున్నారు. ఆ విగ్ర‌హాన్ని తొల‌గించ‌డంపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు. తమిళుల హృదయాల్లో చెరిగిపోయిన ముద్ర వేసిన ఆ మ‌హాన‌టుడికి ఇటువంటి గౌర‌వం ద‌క్కింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌నకు శివాజీ గ‌ణేశ‌న్ తండ్రి లాంటి వ్యక్తి అని క‌మ‌ల్ అన్నారు. అటువంటి గొప్ప వ్య‌క్తి శివాజీ గణేశన్ కంటే ప్రభుత్వం గొప్పదేమీ కాదని చెప్పారు. త్వ‌ర‌లోనే శివాజీ గ‌ణేశ‌న్ కోసం మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసి దానిని జీవితాంతం కాపాడుకుందామన్నారు.

మ‌రోవైపు, ఈ విగ్రహం కారణంగా మెరీనా బీచ్ వ‌ద్ద ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతున్నందున‌ దానిని తొలగించాలని కోరుతూ గాంధేయవాది శ్రీనివాసన్ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపిన కోర్టు శివాజీ గ‌ణేశ‌న్ విగ్రహాన్ని తొలగించాలని తీర్పు వెలువ‌రించింది. కోర్టు తీర్పు ప్ర‌కార‌మే తాము విగ్ర‌హాన్ని తొల‌గించామ‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం చెబుతోంది. కోర్టు ఆదేశాల ప్ర‌కారం గురువారం తెల్లవారుజామున ఈ విగ్రహాన్ని తొలగించి, అడయార్ లోని స్మారక మండపానికి తరలించారు.