Begin typing your search above and press return to search.

'శ్యామ్ సింగరాయ్' కోసం 'సిరివెన్నెల' రాసిన చివరి పాటను చూశారా..!

By:  Tupaki Desk   |   28 Dec 2021 4:30 PM GMT
శ్యామ్ సింగరాయ్ కోసం సిరివెన్నెల రాసిన చివరి పాటను చూశారా..!
X
నేచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కించిన తాజా చిత్రం ''శ్యామ్ సింగరాయ్''. ఇందులో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 24న తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడులైంది. అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాలోని 'సిరివెన్నెల' అనే వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

'నెలరాజుని.. ఇలారాణి.. కలిపింది కదా సిరివెన్నెలా.. దూరమా.. తీరమై చేరుమా..' అంటూ సాగిన ఈ సోల్ ఫుల్ మెలోడీ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 1970ల కాలం నాటి పరిస్థితుల్లో నాని - సాయి పల్లవిలపై చిత్రీకరించిన ఈ పాట.. శ్యామ్ సింగరాయ్ - దేవదాసి రోజీల మధ్య అందమైన వింటేజ్ ప్రేమకథను తెలియజేస్తోంది. ఇద్దరూ కలసి రాత్రి సమయంలో రహస్యంగా బయటకు వెళ్లి సినిమాలు చూస్తూ సమయాన్ని గడుపుతుండటం.. పడవలో విహరిస్తుండటం.. సాయి పల్లవి క్లాసికల్ డ్యాన్స్ వంటివి ఈ పాటలో చూడొచ్చు.

ఇది లెజెండరీ గీత రచయిత, దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరి పాట. 'ఇది నింగికి నేలకు జరిగిన పరిచయమే..' అంటూ ప్రేమలోని గాఢతను.. లోతైన అర్థాన్ని కలిగిన సాహిత్యాన్ని సీతారామశాస్త్రి అందించారు. ఈ పాట రూపంలో సిరివెన్నెల కళ్లముందు కదలాడుతున్నారంటూ సంగీత సాహిత్య ప్రియులు ఎమోషనల్ అవుతున్నారు.

'సిరివెన్నెల' గీతానికి మిక్కీ జె మేయర్ అద్భుతమైన బాణీలు సమకూర్చగా.. యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి వినసొంపుగా ఆలపించారు. కృతి మహేష్ ఈ పాటకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

ఇకపోతే సీతారామశాస్త్రి అంత్యక్రియలు జరిగిన రోజునే ఆ పాట రికార్డ్ చేయబడింది. ఆయనకు నివాళిగా చిత్ర బృందం ఈ గీతానికి 'సిరివెన్నెల' అనే పేరు పెట్టుకోవడమే కాకుండా.. ఈ పాటను లెజెండరీ లిరిసిస్ట్ కే అంకితం ఇచ్చారు. 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో సీతారామశాస్త్రి 'ప్రణవాలయా' అనే మరో పాట కూడా రాయడం విశేషం.

కాగా, 'శ్యామ్ సింగరాయ్' చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. ఇందులో నాని రెండు పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిచారు. రాహుల్ రవీంద్రన్ - మురళీ శర్మ - అభినవ్ గోమటం - జిషు సేన్ గుప్తా - లీలా శాంసన్ - మనీష్ వాద్వా - బరున్ చందా కీలక పాత్రలు పోషించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు.