Begin typing your search above and press return to search.

సింగీతం సినిమా తీస్తున్నాడు

By:  Tupaki Desk   |   7 Sep 2016 7:30 PM GMT
సింగీతం సినిమా తీస్తున్నాడు
X
తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. పుష్పక విమానం.. ఆదిత్య 369.. విచిత్ర సోదరులు.. భైరవ ద్వీపం.. ఇలా ఆయన తీసిన కళాఖండాలు ఒకటా రెండా? ఇండియాలో మరే దర్శకుడూ చేయనన్ని ప్రయోగాలు చేసిన ఘనత సింగీతందే. వయసు మీద పడ్డాక చాలామంది సైలెంట్ అయిపోతారు కానీ.. సింగీతం మాత్రం ఇప్పటికీ కుర్రాడిలా ఉత్సాహం చూపిస్తారు. 80 ప్లస్ లో కూడా ఆయన దర్శకుడిగా సినిమా తీశారు. బాలయ్య ఓకే అంటే ఆదిత్య 369 సీక్వెల్ తీయడానికి కూడా ఇప్పుడు కూడా రెడీగా ఉన్నారు. ఆ చిత్రానికి స్టోరీ బోర్డ్ కూడా రెడీ చేసుకుని సర్వ సన్నద్ధంగా ఉన్నారు సింగీతం.

ఐతే వేరే కమిట్మెంట్ల వల్ల బాలయ్య ఇప్పుడే ఈ సినిమాకు డేట్లు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో ఈలోపు దర్శకుడిగా ఇంకో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు సింగీతం. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో ఒకరైన ఎల్లాప్రగడ సుబ్బారావు జీవిత కథను సినిమాగా తీయాలని భావిస్తున్నారు సింగీతం. ఈ దిశగా ప్రస్తుతం ఆయన పరిశోధన చేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన బయో కెమిస్ట్రీలో గొప్ప పరిశోధనలు చేశారు. ఆయన ఫోలిక్ ఆమ్లం యొక్క వాస్తవ రూపాన్ని కనుగొనడం ద్వారా.. రక్తహీనత వల్ల కలిగే ప్రాణాంతక వ్యాధి నిర్మూలనకు మందు తయారీలో కీలక పాత్ర పోషించారు. ఇంకా క్షయ.. బోదకాలు.. టైఫాయిడ్.. పాండు రోగం వంటి వాటికి కూడా మందులు కనుగొన్నారు. అలాంటి గొప్ప శాస్త్రజ్నుడి మీద సినిమా తీయడానికి సింగీతం పూనుకోవడం గొప్ప విషయమే.