Begin typing your search above and press return to search.

అందాల మెరుపుతీగకు అదృష్టం కలిసొచ్చేనా?

By:  Tupaki Desk   |   16 Dec 2020 11:00 AM IST
అందాల మెరుపుతీగకు అదృష్టం కలిసొచ్చేనా?
X
సినిమాల్లో రాణించాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు .. అభినయం కూడా తెలియాలి. ఈ రెండూ ఉన్నాయికదా ఇక దూసుకుపోవచ్చుననుకుంటే పొరపాటే. ఆ రెండింటికీ అదృష్టం కూడా తోడు కావాలి. అప్పుడే అవకాశాలు తలుపుతడటం .. విజయాలు పలకరించడం .. అంచెలంచెలుగా ఎదగడం జరుగుతుంది. లేదంటే అవకాశాలు ముఖం చాటేస్తాయి .. విజయాలు దోబూచులాడతాయి .. అభిమానులతో గ్యాప్ పెరిగిపోతుంది. అందువలన ప్రయత్నాలను పరుగులు పెట్టిస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ముందుకు వెళ్లడమే.

ఈ విషయం అర్థం కావడానికి ఎవరికైనా కొంత సమయం పడుతుంది. ఆ తరువాతనే వెళ్లవలసిన మార్గం స్పష్టంగా కనిపిస్తుంది .. విజయాల పిలుపు వినిపిస్తుంది. గతంలో ఎదురైన పరాజయాలను పక్కన పెట్టేసి, కొత్త ఉత్సాహంతో అడుగులు ముందుకు వేయాలేగానీ అనుకున్నది సొంతమై తీరుతుంది. ఇప్పుడు అదే పట్టుదలతో ఓ మెరుపుతీగ తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది. అందమైన ఆ మెరుపుతీగె పేరే 'సిమ్రత్ కౌర్'. ఈ పేరు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది కదూ. విన్నట్టే కాదు .. చూశారు కూడా! త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న 'డర్టీ హరి' సినిమాలో హీరోయిన్ ఈ అమ్మాయినే.

సిమ్రత్ కౌర్ .. చాలా నాజూకుగా ఉంటుంది .. ఎల్లోరా గుహల నుంచి ఎగిరొచ్చిన శిల్పంలా ఉంటుంది. అలాంటి ఈ అమ్మాయి 2017లోనే 'ప్రేమతో మీ కార్తీక్' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైంది. ముత్యాలు వర్షిస్తాయేమోననే కళ్లు .. కెంపులు పేర్చినట్టుగా అనిపించే పెదాలు చూసి కుర్రాళ్లు 'ఔరా!' అంటూ నోరెళ్లబెట్టారు. అయితే ఈ సినిమా ఆడకపోవడం వలన, ఆమె అందం గురించిన చర్చ జరగలేదు. ఆ తరువాత చేసిన 'పరిచయం' సినిమాకి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. సరైన ఎంపిక లేకపోవడం వలన .. రావలసిన గుర్తింపు రాలేకపోయింది.

ఈ నేపథ్యంలో ఈ అమ్మాయి 'డర్టీ హరి' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దర్శకుడు ఎమ్మెస్ రాజు ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమాను పూర్తి చేశారు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసిన వాళ్లు .. ప్రమోషన్స్ లో సిమ్రత్ ను చూసిన వాళ్లు కొత్తమ్మాయనే అనుకోవడం ఆశ్చర్యం. రొమాంటిక్ పాళ్లు ఎక్కువగా ఉన్న సినిమా కావడంతో ఈ అమ్మాయి అందరి కళ్లలో పడిపోతోంది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచేసిందేమో, కుర్రాళ్లందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమాపైనే ఉంది. చూడాలి .. ఈ సినిమాతోనైనా ఈ మెరుపుతీగకి అదృష్టం కలిసొస్తుందేమో!