Begin typing your search above and press return to search.

జీఎస్టీపై శింబు సాంగ్‌...వైర‌ల్‌!

By:  Tupaki Desk   |   10 Nov 2017 4:59 PM IST
జీఎస్టీపై శింబు సాంగ్‌...వైర‌ల్‌!
X
హీరో విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ చిత్రంలో జీఎస్టీ డైలాగుల‌పై పెను దుమారం రేగిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ నేత‌లు మొద‌లుపెట్టిన ఈ వివాదం చినికిచినికి గాలివానై చివ‌ర‌కు మతం రంగు పులుముకుంది. ప‌లువురు త‌మిళ హీరోలు - సెల‌బ్రిటీలు మెర్స‌ల్ కు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఆ వివాదం స‌ద్దుమ‌ణుగుతోంద‌న్న నేప‌థ్యంలో తాజాగా బీజేపీ విధానాల‌ను మ‌రో త‌మిళ‌ హీరో తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించాడు. బీజేపీ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన పెద్ద నోట్ల రద్దుపై త‌మిళ మీరో శింబు పాడిన పాట వైర‌ల్ అయింది. పెద్దనోట్ల రద్దు తర్వాత వచ్చిన జీఎస్టీ....పేదోడి న‌డ్డి విరిచింద‌ని శింబు ఓ సెటైరికల్ పాట పాడాడు. శింబు పాడిన పాట సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది.

నోట్ల రద్దు అనంత‌రం బ్యాంకుల క్యూ క‌ట్టిన సామాన్యుల ఇక్కట్లను ఆ పాటలో కళ్లకు కట్టినట్లు చూపించారు. వ్యవసాయం రుణాల కోసం వ‌చ్చిన రైతుల‌ను మెడపట్టుకుని బయటకు గెంటేస్తారని - విజయ్ మాల్యా లాంటి వాళ్ల‌కు రుణాలు ఇచ్చి లండన్‌ కు పంపిస్తారని సెటైరిక‌ల్ గా ఆ పాట సాగుతుంది. జీఎస్టీతో పేదోడి పరిస్థితిని అధ్వాన్నంగా త‌యారైంద‌ని - ప్రజల కష్టాలను వివరించారు. బాలమురుగన్...మంచి బీట్ తో ఈ పాట‌ను కంపోజ్ చేశారు. శింబు గతంలో పాడిన ఓ పాట వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఆ బీప్ సాంగ్ పై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే, ఈ సారి మాత్రం శింబు పాట‌కు ప్రశంసలు ద‌క్కుతున్నాయి. త‌మిళ హీరోలు సామాజిక అంశాల‌పై చురుగ్గా స్పందిస్తార‌ని నెటిజ‌న్లు కితాబిచ్చారు. ఈ పాటని పోస్ట్ చేస్తూ... టాలీవుడ్ - బాలీవుడ్ హీరోలని నెటిజ‌న్లు ప్రశ్నిస్తున్నారు. బీజేపీని త‌మిళ హీరోలు టార్గెట్ చేశార‌ని కామెంట్లు పెడుతున్నారు. మెర్స‌ల్ లో ఒక్క జీఎస్టీపై డైలాగులు ఉన్నందుకే ర‌చ్చ‌ర‌చ్చ చేసిన బీజేపీ నేత‌లు ఈ పాట‌పై ఏవిధంగా స్పందిస్తారో అన్న విష‌యం ఆస‌క్తిగా మారింది.