Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండలా నాకు బ్రేక్ రాలేదు .. నేను జీరో అన్నారు!

By:  Tupaki Desk   |   17 Feb 2022 10:30 AM GMT
విజయ్ దేవరకొండలా నాకు బ్రేక్ రాలేదు .. నేను జీరో అన్నారు!
X
ఈ మధ్య కాలంలో విడుదలకి ముందే యూత్ ను ఎక్కువగా ఆకర్షించిన .. ఆసక్తిని రేకెత్తించిన సినిమా ఏదైనా ఉందంటే .. అది 'డీజే టిల్లు'నే. సిద్ధు జొన్నలగడ్డ .. నేహా శెట్టి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా నుంచి అప్ డేట్స్ ను ఒక రేంజ్ లో వదిలారు. డైలాగ్ కి ముందు కిస్సు .. డైలాగ్ తరువాత కిస్సు అన్నట్టుగా చూపించడంతో ఈ సినిమాలో హీరో దినచర్యనే రొమాన్స్ తో మొదలై రొమాన్స్ తో ముగుస్తుందా? అనుకున్నారు. థియేటర్లకు 'టిల్లు' రావడంతోనే ఎగబడ్డారు. ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది.

నిజానికి యూత్ కి కావలసిన కంటెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ, ఈ సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుందని చాలామంది ఊహించలేదు. ఒక స్టార్ హీరో సినిమా ఏ స్థాయి వసూళ్లను రాబడుతుందో .. ఈ సినిమా ఆ స్థాయి వసూళ్లను కొల్లగొడుతుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ నిన్న సాయంత్రం వైజాగ్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ వేదికపై సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ .. "ఈ సమయం కోసం .. ఇలాంటి వేదికపై మాట్లాడే ఒక రోజు కోసం నేను 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను .. అలాంటి ఒక రోజు ఇప్పుడు వచ్చింది.

ఇండస్ట్రీలో ఏదో చేయాలనే ఒక 'కల' .. ఆర్టిస్టులుగా .. దర్శకులుగా మాలో ఉన్న ఒక 'కళ' .. రైటర్లుగా మా తలరాతను మేమే రాసుకుకోవాలనే కలం .. దాని బలం గెలిచాయి ఈ రోజున. మిమ్మల్ని ఈ స్థాయిలో సంతోషపెట్టడానికి మేమంతా నిజంగా చాలా ఏడ్చాము. అలా 12 ఏళ్ల పాటు కష్టపడితే ఇలాంటి ఒక సాయంత్రం వచ్చింది. అలాంటి నా ప్రయాణంలో ఒక రోజును గురించి మాత్రమే మీకు చెప్పాలనుకుంటున్నాను.

'గుంటూరు టాకీస్' అనే ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి బాగానే డబ్బులు వచ్చాయిగానీ, 'పెళ్లి చూపులు'తో విజయ్ దేవరకొండకి వచ్చిన బ్రేక్ .. 'క్షణం' అనే సినిమాతో అడివి శేష్ కి వచ్చిన బ్రేక్ నాకు రాలేదు. ఎందుకు రాలేదనే విషయం నాకు అర్థం కాలేదు. దాంతో నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలనుకున్నాను. నా గురించి మీడియాలో వచ్చేలా .. వెబ్ సైట్స్ లో ఆర్టికల్స్ వచ్చేలా చూడమని నా ఫ్రెండ్ ను అడిగాను. ఆ పని కోసం అతని వెంటపడ్డాను. ఒక రోజున వాడు నాకు కాల్ చేసి "నీ గురించి ఎవరూ రాయరు నువ్వో జీరో .. నీ గురించి ఎవరూ రాయరు .. రాసినా ఎవరూ చదవరు" అని చెప్పాడు.

అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. 'మన గురించి న్యూస్ రాయడానికి ఎవరూ లేనప్పుడు మనమే ఒక న్యూస్ గా మారాలి' అనుకున్నాను. ఆ తరువాత 'కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమా చేశాను .. పాండమిక్ లో ఓటీటీలో రిలీజ్ చేయగా సక్సెస్ అయింది.

ఆ తరువాత ' మా వింతగాథ వినుమా' అనే సినిమా చేశాను .. చూసినవాళ్లు 'నాట్ బ్యాడ్' అన్నారు. ఆ తరువాత చేసింది ఈ సినిమానే .. ఈ రోజున బ్లాక్ బస్టర్ కొట్టాము. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. పాండమిక్ వచ్చినా .. తుఫాన్ వచ్చినా మేము అనుకున్నది చేస్తాము .. ఎందుకంటే మాకు తెలిసినది సినిమా ఒకటే. మమ్మల్ని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత నాగవంశీగారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.