Begin typing your search above and press return to search.

'సినిమాని వదిలేయండి'.. హీరో సిద్దార్థ్ ట్వీట్స్ వైరల్..!

By:  Tupaki Desk   |   24 Dec 2021 4:10 PM GMT
సినిమాని వదిలేయండి.. హీరో సిద్దార్థ్ ట్వీట్స్ వైరల్..!
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరల అంశం రోజురోజుకి వివాదంగా మారుతోంది. టికెట్ రేట్లు తగ్గిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద.. కొందరు సినీ ప్రముఖులు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘శ్యామ్ సింగరాయ్‘ మీడియా సమావేశంలో హీరో నాని టికెట్ ధరల తగ్గింపుపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై 'బొమ్మరిల్లు' హీరో సిద్ధార్థ్ తనదైన శైలిలో స్పందించారు.

సిద్దార్థ్ శుక్రవారం #LeaveCinemaAlone (సినిమాను వదిలేయండి) అనే హ్యాష్ ట్యాగ్ తో వరుస ట్వీట్లు చేశారు. ''భూముల ధరలను ఎందుకు నియంత్రించరు? తమ తోటి పౌరులతో కలిసి ప్రైమ్ లొకాలిటీ నివసించడానికి అర్హులైన పేదలు.. వారి నగరాల్లో ప్రామాణిక ధరకు భూమిని ఎందుకు పొందరు? భారతదేశంలో ఎక్కువ భూమి ఎవరిది?'' అని సిద్దార్థ్ ప్రశ్నించారు.

మరో ట్వీట్ లో ''ప్రైవేట్ టాక్సీలు గంటకు ఇంత అని టారిఫ్ విధించవచ్చు. బట్టల బ్రాండ్లు లేటెస్ట్ స్టైల్స్ కోసం ప్రీమియం వసూలు చేయవచ్చు. సెల్ ఫోన్లు లేటెస్ట్ మోడళ్లకు ప్రీమియం వసూలు చేయగలవు. కానీ సినిమా నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్లు లేటెస్ట్ కంటెంట్ లేదా అధిక ధర ఆఫర్ల కోసం ప్రీమియం వసూలు చేయలేరు. ఇదేం లాజిక్'' అని పేర్కొన్నారు.

''నల్లధనాన్ని నిరోధించండి. చట్టబద్ధంగా సంపాదనపై పన్ను విధించండి. దయచేసి మీ అనుచరులకు సినిమాకి వెళ్లి కష్టాల్లో ఉన్న వ్యాపారానికి మద్దతు ఇవ్వమని చెప్పండి. కుదరకపోతే ఫర్వాలేదు.. కానీ దయచేసి ఫిలిం మేకింగ్ ను సినిమా బిజినెస్ ని వదిలేయండి'' అని సిద్దార్థ్ అన్నారు.

''మన ఆస్తి మేధో సంపత్తితో తయారైందని మనం ఎన్నుకోబడిన నాయకులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందా? సరే.. బలవంతంగా లేదా అవినీతితో మీరు స్వంతం చేసుకోవడానికి ప్రయత్నించలేని.. చేయకూడని ఒక రకమైన ఆస్తి మేధో సంపత్తి'' అని మరో ట్వీట్ లో సిద్దార్థ్ పేర్కొన్నారు.

అంతకుముందు టికెట్ల ధరలు తగ్గించడంపై మంత్రులను ఉద్దేశిస్తూ సిద్దార్థ్ సెటైర్లు వేశాడు. ''సినిమా ఖర్చు తగ్గించి, కస్టమర్స్కు డిస్కౌంట్ అందిస్తున్నామంటున్నారు మంత్రులు. మరి మేము ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం. వాటిని కొంత మంది విలాసాలకు ఖర్చు పెడుతున్నారు. ఇంకొందరు అవినీతి రూపంలో లక్షల కోట్లు కాజేస్తున్నారు. మీ విలాసాలు తగ్గించుకొని మాకు డిస్కౌంట్స్ ఇవ్వండి'' అంటూ ట్వీట్ చేశాడు.

''పన్ను స్లాబ్లు మరియు ప్రభుత్వ వైఖరితో సినిమా జూదానికి దిగజారింది. మీరు మద్యం సిగరెట్ ధరలను ఎందుకు పెంచరు?. అవి ప్రజలకు హాని చేస్తాయి. మేము ప్రజలను ఎంటర్టైన్ చేస్తాం'' అని సిద్దార్థ్ వివరించారు. ''స్టేడియాల పరిమాణాన్ని సౌకర్యాలను తగ్గించడం మరియు క్రికెట్ మ్యాచ్ల నిర్వహణ ఖర్చును తగ్గించడం ఎలా.. కస్టమర్ కు డిస్కౌంట్ ఇవ్వండి.. క్రికెటర్ జీతాలను ప్రశ్నించండి. వారికి టాలెంట్ ఉంది. యాక్టర్స్ ఏమి ఉంది వినోదమే వినోదం. మరి మా పరిశ్రమపై ఎందుకు ఈ ద్వేషం?'' అని ప్రశ్నించాడు.

సిద్దార్థ్ తన ట్వీట్లలో ఎవరి గురించి అనేది చెప్పకపోయినప్పటికి.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే టికెట్ రేట్ల సమస్య నడుస్తోంది కాబట్టి.. ఏపీ సర్కార్ ను ఉద్దేశించి చేసినవే అని అందరూ చర్చించుకుంటున్నారు.