Begin typing your search above and press return to search.

నన్ను స్టార్ ను చేసింది తెలుగు ప్రేక్షకులే: హీరో సిద్ధార్థ్

By:  Tupaki Desk   |   10 Oct 2021 4:32 AM GMT
నన్ను స్టార్ ను చేసింది తెలుగు ప్రేక్షకులే: హీరో సిద్ధార్థ్
X
శర్వానంద్ - సిద్ధార్థ్ హీరోలుగా .. ఒక మల్టీస్టారర్ గా 'మహా సముద్రం సినిమా నిర్మితమైంది. భారీ తారాగణంతో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై సిద్ధార్థ్ సందడి చేశాడు. వేదికపైకి వస్తూనే ఆయన 'బొమ్మరిల్లు' సినిమాలోని 'అపుడో .. ఇపుడో .. ఎపుడో' పాటతో అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచాడు.

ఆ తరువాత సిద్ధార్థ్ మాట్లాడుతూ .. "అందరికీ నమస్కారం .. నా పేరు సిద్ధార్థ్. ఇప్పుడు నేను పాడిన పాట, 15 ఏళ్ల క్రితం వచ్చిన 'బొమ్మరిల్లు' సినిమాలోది. ఆ సినిమా 15 ఏళ్లు పూర్తయినా సెలబ్రేట్ చేయకపోవడానికి కారణం .. కోవిడ్. ఇవాళ నేను ఈ పాటను నేను మీ ముందు ఎందుకు పాడానంటే,నాకూ .. తెలుగు ప్రేక్షకులకు మధ్యలో గ్యాప్ ఉందని విన్నాను. అలాంటి గ్యాప్ ఏదీ లేదు. ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నవాళ్లు, తమ పేరెంట్స్ లవ్ చేసుకుంటున్నప్పుడు వారి ఫేవరేట్ సినిమా ఏదని అడిగితే 'బొమ్మరిల్లు' సినిమా అనే చెబుతారు.

ఈ మధ్యకాలంలో నన్ను మీరు చూడలేదు కనుక, ఒక ఇంట్రడక్షన్ ఇద్దామని చెప్పేసి ఈ పాట పాడాను. నాకూ తెలుగు ప్రేక్షకులకు మధ్య ఎప్పుడూ గ్యాప్ రాదు .. నేను మీ సిద్దూను. 'మీరు స్టారా? .. యాక్టరా?' అని నన్ను చాలామంది అడుగుతుంటారు. నన్ను నేను ఎప్పుడూ ఒక స్టార్ గా అనుకోలేదు. నేను ఒక యాక్టర్ ని మాత్రమే. నన్ను స్టార్ ను చేసింది తెలుగు ప్రేక్షకులే. ఏ స్టార్ కి సొంతంగా వెలుగు ఉండదు. ఎంత పెద్ద స్టార్ అయినా సూర్యుడి నుంచి వెలుగు తీసుకోవలసిందే. తెలుగు ప్రేక్ల్షకులు ఒక సూర్యుడిలా నన్ను స్టార్ ను చేశారు.

'మహా సముద్రం' .. ఇలాంటి ఒక వేదిక కోసం నేను తొమ్మిదేళ్లుగా వెయిట్ చేస్తున్నాను. ఇంతకాలానికి నేను మళ్లీ ఇక్కడ నిలబడటానికి కారకులైన వాళ్లందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనా సమయంలో 85 రోజుల పాటు అవుట్ డోర్ లో షూటింగ్ చేయడం నిజంగా సాహసమే. ఈ సినిమాకి పనిచేసిన నటీనటులందరికీ ఇది ఒక మైలురాయి అవుతుందని నేను చాలా నమ్మకంగా చెప్పగలను. నాకు నచ్చిన పనిని నాతో చేయిస్తూ .. నన్ను గౌరవిస్తూ .. గారం చేస్తూ .. డబ్బులిస్తే బాగుండేదనే ఒక డ్రీమ్ నాకు ఉండేది. ఆ డ్రీమ్ ఈ సినిమాతో నెరవేరింది.

జగపతిబాబు గారు ఈ ఫంక్షన్ కి రాలేకపోయారు .. ఈ సినిమాలో ఆయన 'చుంచుమామ'గా చేశారు. ఆయన లుక్ .. నటన చూసి మేం షాక్ అయ్యాము. మాతో పోటీపడుతూ .. పరుగులు తీస్తూ ఆయన చేశారు. ఆయన ఎనర్జీ .. యాటిట్యూడ్ .. దగ్గర నుంచి చూశాము .. ఆయన నుంచి మేం చాలా నేర్చుకున్నాము. ఇక నాకు రావు రమేశ్ గారంటే చాలా ఇష్టం. ఆయన డైలాగ్ డెలివరీ .. మేనరిజమ్స్ .. ఆయన టాలెంట్ .. గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకా ఆయనతో కలిసి చాలా సినిమాలు చేయాలనుకుంటున్నాను. ఈ సినిమాలో ఆయన గొప్ప పాత్రను పోషించడమే కాదు, ఈ సినిమా పట్టాలెక్కడంలోనూ కీలకమైన పాత్రను పోషించారు" అంటూ చెప్పుకొచ్చాడు.