Begin typing your search above and press return to search.

30 కోట్లు పలుకుతున్న నాని సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్..?

By:  Tupaki Desk   |   23 April 2021 6:30 AM GMT
30 కోట్లు పలుకుతున్న నాని సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్..?
X
నేచురల్ స్టార్ నాని హీరోగా 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్‌ సాంకృత్యన్‌ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ''శ్యామ్‌ సింగ రాయ్‌''. ఇందులో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్‌ బోయనపల్లి ఈ చిత్రాన్ని దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని సమాచారం. ఇది నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా. ఇప్పటికే విడుదలైన నాని ఫస్ట్‌ లుక్‌ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ నేపథ్యంలో 'శ్యామ్‌ సింగ రాయ్‌' నాన్ థియేట్రికల్ రైట్స్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.

'శ్యామ్‌ సింగ రాయ్‌' మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ కు 30 కోట్లకు పైగా చెల్లించడానికి ముందుకొస్తున్నారని తెలుస్తోంది. అయితే ప్రొడ్యూసర్ వెంకట్‌ బోయనపల్లి మాత్రం అప్పుడే ఈ హక్కులను అమ్మడానికి రెడీగా లేడట. టీజర్ - ట్రైలర్ వంటి సినిమా ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేసిన తర్వాత డిమాండ్ ని బట్టి నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్మాలని నిర్మాత ఆలోచిస్తున్నారట. ఏదేమైనా కేవలం ఒక్క పోస్టర్ తోనే ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఇంత భారీ ధర పలకడం మామూలు విషయం కాదు.

ఇకపోతే 'శ్యామ్‌ సింగ రాయ్‌' ప్రస్తుతం ఫైనల్ షెడ్యుల్ షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ పరిసరాల్లో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్ల ఖర్చుతో వేసిన సెట్ లో ఈ సినిమా చిత్రీకరణ చేస్తున్నారు. ఈ చిత్రంలో జిషు సేన్‌ గుప్తా - రాహుల్‌ రవీంద్రన్‌ - మురళీ శర్మ - అభినవ్‌ గోమటం కీలక పాత్రలు పోషిస్తున్నారు. జంగా సత్యదేవ్ స్టోరీ అందించగా.. మిక్కీ జె.మేయర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.