Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : శ్యామ్ సింగ రాయ్

By:  Tupaki Desk   |   24 Dec 2021 8:31 AM GMT
మూవీ రివ్యూ : శ్యామ్ సింగ రాయ్
X
చిత్రం : 'శ్యామ్ సింగ రాయ్'

నటీనటులు: నాని-సాయిపల్లవి-కృతి శెట్టి-జిష్ణు సేన్ గుప్తా-రాహుల్ రవీంద్రన్-మడోన్నా సెబాస్టియన్-అభినవ్ గోమఠం-శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
ఛాయాగ్రహణం: సాను వర్గీస్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
కథ: సత్యదేవ్ జంగ
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాహుల్ సంకృత్యన్

ఓటీటీ బాట పట్టిన ‘వి’.. ‘టక్ జగదీష్’ చిత్రాలతో నిరాశ పరిచిన నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ‘శ్యామ్ సింగ రాయ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘ట్యాక్సీవాలా’ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ రూపొందించిన ఈ చిత్రం ఆసక్తికర ప్రోమోలతో అంచనాలను పెంచింది. మరి ‘శ్యామ్ సింగ రాయ్’ ఈ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

వాసుదేవ్ (నాని) ఒక వర్ధమాన సినీ దర్శకుడు. సినిమాల మీద ఇష్టంతో ఉద్యోగం కూడా వదులుకున్న అతను ఒక షార్ట్ ఫిలిం ద్వారా నిర్మాతను మెప్పించి సినిమా తీసే అవకాశం అందుకుంటాడు. ఆ సినిమా కూడా పెద్ద విజయం సాధించి వాసుకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. అతడి తొలి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడంతో పాటు ఇంకో రెండు సినిమాలు తీయడానికి ఓ బాలీవుడ్ నిర్మాత ముందుకొస్తాడు. దీనికి సంబంధించి ప్రకటన చేస్తున్న సమయంలోనే వాసును పోలీసులు అరెస్టు చేస్తారు. అతను దివంగత బెంగాల్ రచయిత శ్యామ్ సింగ రాయ్ కథల్ని కాపీ కొట్టినట్లు ఆరోపణలు రావడమే అందుక్కారణం. మరి నాలుగు దశాబ్దాల కిందటే చనిపోయిన శ్యామ్ తో వాసుకేంటి సంబంధం.. నిజంగానే అతను ఆ రచనల్ని కాపీ కొట్టాడా.. ఇంతకీ ఎవరీ శ్యామ్ సింగ రాయ్.. చివరికీ కేసు ఏమైంది అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఈ రోజుల్లో ‘మంచి’ సినిమా తీశాం అని చెప్పుకోవడానికి చాలామందికి భయం! హీరోను ఉదాత్తమైన పాత్రలో చూపించి.. మంచి ఉద్దేశాలతో.. గొప్ప భావజాలంతో సినిమా తీస్తే ప్రేక్షకులు దానికి పట్టం కడతారన్న గ్యారెంటీ లేదు. సందేశాలిస్తామంటే వాటిని మడిచి ఫైల్సులో దాచుకోమంటున్నారు జనాలు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే కేవలం ‘మంచి’ సినిమా అన్న పేరు తప్పితే.. డబ్బులు రావనే అభిప్రాయం బలపడిపోతోంది. ఐతే ఇటు ఫిలిం మేకర్స్.. అటు ప్రేక్షకులు ‘ఎంటర్టైన్మెంట్’ మాయలో పడి కొట్టుకుపోతున్న సమయంలో చాలా కొద్దిమంది మాత్రమే ధైర్యం చేసి ‘మంచి’ సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు.

అందులో ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్ర బృందానికి కూడా చోటు దక్కుతుంది. ఒక సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా పోరాడటమే కాక.. సమాజాన్ని చైతన్యవంతం చేసిన ఒక రచయిత గురించి తీసిన కథ అనగానే ఇదొక ‘డ్రై మూవీ’ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఐతే ఈ కథను సాధ్యమైనంత వరకు కమర్షియల్ గా కూడా వర్కవుటయ్యేలాగానే తీర్చిదిద్దాడు యువ దర్శకుడు రాహుల్ సంకృత్యన్. కాకపోతే ‘కమర్షియల్’ ఇంకాస్త డోస్ పెంచి ఉంటే ‘శ్యామ్ సింగరాయ్’ మరింత జనరంజక చిత్రం అయ్యుండేది.

‘శ్యామ్ సింగ రాయ్’ ట్రైలర్ చూసినపుడే ఈ కథ మీద ఒక అంచనా వచ్చేసి ఉంటుంది. ఇది పునర్జన్మతో ముడిపడ్డ కథ అనే సంగతి అర్థమైపోతుంది. యంగ్ నానితో కథను మొదలుపెట్టి.. మధ్యలో శ్యామ్ సింగ రాయ్ పాత్రను ప్రవేశ పెట్టి.. తర్వాత ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లి.. మళ్లీ వర్తమానంలోకి వచ్చి కథను ముగిస్తారని స్పష్టంగా తెలిసిపోయింది. అవును.. ఆ అంచనాలకు తగ్గట్లే నడుస్తుందీ కథ. ఐతే ఇది పునర్జన్మల కథే అయినప్పటికీ.. యంగ్ నానితో శ్యామ్ సింగ రాయ్ పాత్రకు ముడిపెట్టిన విధానం.. అలాగే శ్యామ్ కథకు చివర్లో యంగ్ నానితో ఇచ్చిన ముగింపు ఈ చిత్రాన్ని భిన్నంగా నిలబెడతాయి. ఆ సర్ప్రైజులేంటన్నది తెర మీదే చూసి తెలుసుకోవాలి. ఐతే సినిమాలో ఎగ్జైటింగ్ పార్ట్ కచ్చితంగా శ్యామ్ సింగ రాయ్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాకే.

ఇది మొదలవడానికి ముందు ప్రథమార్ధంలో చాలా వరకు కాలక్షేప వ్యవహారం లాగే కనిపిస్తుంది. షార్ట్ ఫిలిం తీసి సత్తా చాటుకుని సినిమా అవకాశం అందుకోవాలని చూసే యంగ్ ఫిలిం మేకర్ గా నాని పాత్రను మామూలుగానే తీర్చిదిద్దారు. తొలి గంటలో సన్నివేశాలు చాలా వరకు సాధారణంగానే అనిపిస్తాయి. సినిమాలంటే ఇష్టం లేని హీరోయిన్ని తన షార్ట్ ఫిలిం లీడ్ రోల్ కోసం ఒప్పించడానికి హీరో పడే పాట్లు.. ఒప్పించాక తనతో షూటింగ్ సందర్భంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం.. తర్వాత ప్రేమ.. వీటి చుట్టూ తిరిగే సన్నివేశాలు సోసోగా నడిచిపోతాయి.

‘శ్యామ్ సింగ రాయ్’ ఊపందుకునేది.. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేది హీరో సూపర్ హిట్ సినిమా తీసి గాల్లో తేలిపోతున్న టైంలో కాపీ రైట్ చట్టం కింద అతను అరెస్టవడంతోనే. శ్యామ్ సింగ రాయ్ పాత్రతో ఇతడికేంటి కనెక్షన్ అనే ప్రశ్న దగ్గర ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది. ఇక ద్వితీయార్ధమంతా చాలా వరకు శ్యామ్ పాత్ర తాలూకు ఫ్లాష్ బ్యాక్ తోనే నడిచిపోతుంది. బలమైన ఎమోషన్లకు తోడు హీరో ఎలివేషన్ సీన్లు కూడా పడటంతో ఫ్లాష్ బ్యాక్ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది. ఆ పాత్ర రంగప్రవేశంతోనే తనదైన ముద్రను వేస్తుంది.

కులం పేరుతో వివక్ష చూపిస్తున్న పెద్ద మనుషులకు హీరో బుద్ధి చెప్పే సన్నివేశం దగ్గర సినిమాలో తొలిసారిగా ప్రేక్షకులు ‘హీరోయిజం’ ఫీలవుతారు. మాస్ కూడా మెచ్చేలా ఉంటుందీ సీన్. ఇక్కడి నుంచి శ్యామ్ పాత్రతో ప్రేక్షకుల ప్రయాణం తేలికైపోతుంది. దేవదాసిగా సాయిపల్లవి పరిచయం.. ఆమెకు శ్యామ్ కు మధ్య ప్రేమకు దారి తీసే సన్నివేశాలు నెమ్మదిగా.. పొయెటిక్ స్టయిల్లో సాగి సామాన్య ప్రేక్షకులకు కొంచెం భారంగా అనిపించొచ్చు. ఐతే ఎమోషన్లను ఫీలవ్వగలిగితే పెద్దగా సమస్య ఉండదు.

మధ్యలో కథనం కొంచెం నెమ్మదించినట్లు అనిపించినా.. కథానాయికకు జరిగిన అన్యాయానికి రగిలిపోయి శ్యామ్ విశ్వరూపం చూపించే సన్నివేశం మళ్లీ చురుకు పుట్టిస్తుంది. కథకు అవసరం పడ్డ చోట మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇచ్చేలా యాక్షన్ ఘట్టాలను.. హీరో ఎలివేషన్ సన్నివేశాలను హ్యాండిల్ చేయగలనని దర్శకుడు రాహుల్ చాటిచెప్పాడు. ఐతే తర్వాత ఇలాంటి ఎపిసోడ్ ఇంకోటి పడి ఉంటే.. ‘శ్యామ్ సింగ రాయ్’ కమర్షియల్ రేంజ్ వేరుగా ఉండేది. ఇక్కడి నుంచి కండ బలం కంటే కలం బలం గొప్పదనే సంకేతాన్ని శ్యామ్ పాత్ర ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. శ్యామ్ పాత్రను ముగించడంలో ఇచ్చిన ట్విస్ట్ ఓకే కానీ.. మంచి ఊపులో సాగుతున్న ఆ పాత్రను అర్ధంతరంగా ముగించినట్లు అనిపించడం ఫ్లాష్ బ్యాక్ లో లోపం. వర్ధమానంలోకి వచ్చాక ‘శ్యామ్ సింగ రాయ్’ సోసోగానే సాగుతుంది.

ముగింపు జస్ట్ ఓకే అనిపిస్తుంది. ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఫినిషింగ్ టచ్ ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నించాడు. దాని పట్ల మిశ్రమ స్పందన ఎదురు కావచ్చు. ఐతే ఓవరాల్ గా చూస్తే శ్యామ్ సింగ రాయ్ పాత్ర ఎంత ఉన్నతంగా అనిపిస్తుందో.. దాంతో ముడిపడ్డ వ్యవహారమంతా కూడా టాప్ క్లాసే. మిగతా అంశాలు కొంత నిరాశకు పరచవచ్చు. నాని అండతో ఎమోషన్లతో ముడిపడ్డ ఒక మంచి కథను.. కమర్షియల్ హంగులతో ఆకర్షణీయంగానే చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు రాహుల్.

నటీనటులు:

నాని గురించి కొత్తగా చెప్పడానికేముంది? పెర్ఫామెన్స్ పరంగా సవాలు విసిరే ఏ కొత్త పాత్ర ఇచ్చినా.. అందులో సులువుగా ఒదిగిపోయి.. ఆశ్చర్యపరుస్తాడు. శ్యామ్ సింగ రాయ్ గా నాని ఆహార్యం మొదలుకుని.. నటన వరకు అన్నీ ఆకట్టుకుంటాయి. నాని కెరీర్లో ఎప్పటికీ చెప్పుకోదగ్గ పాత్రల్లో ఇదొకటిగా నిలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఆద్యంతం అతను ఆకట్టుకున్నాడు. వాసు పాత్ర సాధారణంగా అనిపించడంతో నటన పరంగా నాని కొత్తగా చేయడానికేమీ లేకపోయింది. నాని తర్వాత ఆటోమేటిగ్గా ఎక్కువ స్కోర్ చేసేది సాయిపల్లవినే. ఆమె తెరపై కనిపించిన తొలి మూమెంట్ నుంచి కట్టిపడేస్తుంది. చిన్న చిన్న హావభావాల విషయంలోనూ సాయిపల్లవి తన ప్రత్యేకతను చాటుకుంది.

దేవదాసి పాత్రలోని సంఘర్షణను ఆమె సరిగ్గా చూపగలిగింది. తన నాట్యంతోనూ సాయిపల్లవి మెప్పించింది. కృతి శెట్టి జస్ట్ ఓకే అనిపిస్తుంది. తొలి సినిమాలో మాదిరి ఇందులో పెద్దగా ఆకర్షించలేకపోయింది. మడోన్నా సెబాస్టియన్ బాగానే చేసింది కానీ.. ఆమె మరీ జీవం కోల్పోయినట్లు కనిపించింది. రాహుల్ రవీంద్రన్ తన పాత్రకు న్యాయం చేశాడు. జిష్ణు సేన్ గుప్తా ఓకే. అభినవ్ గోమఠం బాగా చేశాడు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘శ్యామ్ సింగ రాయ్’లో ఉన్నత ప్రమాణాలు కనిపిస్తాయి. మిక్కీ జే మేయర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు. అందులో వచ్చే పాటలు కూడా బాగున్నాయి. ఐతే పాటల్లో సాహిత్య.. సంగీత పరంగా ఒక స్థాయి కనిపించినప్పటికీ.. వినసొంపుగా లేకపోవడం కొంత ప్రతికూలతే. సాను వర్గీస్ ఛాయాగ్రహణం టాప్ క్లాస్ అనడంలో మరో మాట లేదు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ప్రతి సన్నివేశంలోనూ ఛాయాగ్రాహకుడి ప్రతిభ కనిపిస్తుంది. దర్శకుడి అభిరుచి కూడా తోడవడంతో విజువల్ గా ఒక క్లాసిక్ లుక్ వచ్చింది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి.

ఇలాంటి కథకు రాజీ లేకుండా ఖర్చు పెట్టిన నిర్మాత అభినందనీయుడు. సత్యదేవ్ జంగ ఎంచుకున్న కథ ఒక ఫార్మాట్లో సాగినప్పటికీ.. మాస్ మసాలా సినిమాల మధ్య భిన్నంగానే కనిపిస్తుంది. రాహుల్ సంకృత్యన్ దర్శకుడిగా తన అభిరుచిని చాటాడు. ఫ్లాస్ బ్యాక్ లో దర్శకుడిగా అతడి అత్యుత్తమ ప్రతిభ కనిపిస్తుంది. అతడి స్క్రీన్ ప్లేలోనూ కొన్ని మెరుపులున్నాయి. ఐతే కథ మీద ఇంకొంచెం కసరత్తు చేసి ఉంటే.. ముగింపును ఇంకా ఆసక్తికంగా తీర్చిదిద్దుకుని ఉంటే రాహుల్ కు ఇంకా మంచి మార్కులు పడేవి.

చివరగా: శ్యామ్ సింగ రాయ్.. మనసులు గెలుస్తాడు

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre