Begin typing your search above and press return to search.

ఒట్టు తీసి గట్టు మీద పెట్టిన శృతిహాసన్... ?

By:  Tupaki Desk   |   14 Nov 2021 1:30 PM GMT
ఒట్టు తీసి గట్టు మీద పెట్టిన శృతిహాసన్... ?
X
ఒట్టు ఉన్నది ఎందుకు అంటే గట్టు మీద పెట్టడానికే అంటారు అంతా. అవును అవసరార్ధం అన్నీ కుదిరినపుడు ఒట్లు పెడతారు. పరిస్థితులు ప్రతికూలం అయితే చటుక్కున తీసి గట్టు మీద పెట్టేస్తారు. ఇంతకీ శృతి హాసన్ ఒట్టు ఏం పెట్టింది, ఎలా తీసిపెట్టింది అన్నది తెలుసుకోవాలంటే కాస్తా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. శృతి హాసన్ భారతదేశం గర్వించే నటుడు కమల హాసన్ గారాలపట్టి. ఆమె తండ్రి లాగానే సంగీతం లో మంచి అభిరుచి కలిగి ఉంది. ఇక నటనతో పాటు ఇతర విభాగాల్లో కూడా తన పట్టు నిరూపించుకుంది. ఆమె సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినపుడు వరసగా యంగ్ హీరోల పక్కనే నటించింది. ఇపుడు ఆమె వయసు మూడు పదులు దాటింది.

ఒక విధంగా ఆమెకు చాన్సులు తగ్గిపోయాయి. దానికి ఆమె సొంతంగా చేసుకున్నదే ఎక్కువ. ప‌ర్సనల్ గా ఆమె అప్పట్లో ఇబ్బంది పడడంతో స్టార్ హీరోయిన్ గా నంబర్ వన్ రేసులో దూసుకెళ్లాల్సిన అమ్మడు కాస్తా చతికిలపడింది. ఇవన్నీ ఇలా ఉంటే ఆమె మంచి స్పీడ్ లో ఉన్నపుడు సీనియర్లతో అసలు నటించను అని ఒట్టు పెట్టుకుంది. ముఖ్యంగా తన తండ్రి జనరేషన్ హీరోలతో జంటగా చేయను అని కూడా రూల్ ఒకటి పెట్టుకుంది. అందుకే అప్పట్లోనే ఆమెకు కళ్లు చెదిరే పారితోషికం ఇచ్చినా కూడా నో చెప్పేసింది.

కానీ ఇన్నాళ్లకు ఆమె సీనియర్ హీరో బాలయ్య 107 మూవీలో జంటగా నటిస్తోంది. నిజానికి ఇది వండర్ అనే చెప్పాలి. చాలా కాలంగా బాలయ్య పక్కన స్టార్ హీరోయిన్స్ ఎవరూ నటించడంలేదు. ఆయన సైతం ఎలాగోలా సర్దుకుపోతున్నారు. కానీ ఇక్కడ 107 మూవీకి డైరెక్టర్ గోపీచంద్ మలినేని కావడంతో ఆయనకు శృతి హాసన్ తో ఉన్న స్నేహం కారణంగా బాలయ్య మూవీలో ఆమె జంట కట్టింది. దీంతో శృతి ఇక మీదట ఒట్టుని మరచిపోయినట్లే అంటున్నారు అంతా. ఆమె వరసబెట్టి టాలీవుడ్ సీనియర్ హీరోలతో ఒక రౌండ్ వేసేలా ఉందని కూడా టాక్ నడుస్తోంది.

ఇప్పటికే ఆమె మెగాస్టార్ తో చేయాల్సిన మూవీ కాల్షీట్ల కారణంగా కాకుండా పోయింది. కానీ ఇక మీదట మాత్రం టాలీవుడ్ లో నాగార్జున వెంకటేష్, చిరంజీవి వంటి వారి సినిమాల్లో నటించేందుకు ఆమెకు ఎలాంటి అభ్యంతరం ఉండబోదు అంటున్నారు. మొత్తానికి శృతి హాసన్ సీనియర్ హీరోయిన్ అయిపోయినట్లే అంటున్నారు. దాంతో ఆమెకు యంగ్ హీరోల నుంచి చాన్సులు ఆశించవచ్చా అంటే చూడాల్సిందే. ఇక ఆమె పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో నటిస్తున్న సలార్ మూవీ టాప్ మూవీస్ లో ఒకటిగా ఉంది. ఏది ఏమైనా శృతి బాలయ్య కాంబోతో సీనియర్ హీరోల్లో కొత్త ఆశలు మొలకెత్తుతున్నాయట.