Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా అడ్వాంటేజ్ చెప్పిన శృతి

By:  Tupaki Desk   |   1 Oct 2021 1:30 PM GMT
పాన్ ఇండియా అడ్వాంటేజ్ చెప్పిన శృతి
X
యూనివర్శిల్ స్టార్ కమల్‌ హాసన్ నట వారసురాలిగా వెండి తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శృతి హాసన్ ఆ తర్వాత పెద్దగా తండ్రి పేరును వాడుకోలేదు. పూర్తిగా తన సొంత ట్యాలెంట్‌ తోనే శృతి హాసన్ ఇండస్ట్రీలో రాణిస్తూ వస్తుంది. తన తండ్రి ఇమేజ్‌ ను అస్సలు వాడుకోకుండా టాలీవుడ్ తో పాటు కోలీవుడ్‌ మరియు బాలీవుడ్‌ లో వరుసగా ఆఫర్లు దక్కించుకున్న శృతి హాసన్‌ ఇప్పుడు అన్ని భాషల్లో కూడా స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలుగుతోంది. మల్టీ ట్యాలెంటెడ్‌ శృతి హాసన్ హీరోయిన్‌ గా ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాను ప్రభాస్ తో తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న సలార్ సినిమాలో నటించే అవకాశం రావడం పట్ల శృతి హాసన్‌ చాలా సంతోషంగా ఉందట. ఈ అమ్మడు తాజాగా ఒక చిట్ చాట్ లో పాన్ ఇండియా సినిమాల్లో నటించడం వల్ల చాలా అడ్వాంటేజ్ లు ఉన్నాయి అంటూ వ్యాఖ్యలు చేసింది.

పెద్ద హీరోలతో.. పెద్ద సినిమాల్లో నటించడం వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఎక్కువ మందికి రీచ్‌ అయిన సమయంలో ఖచ్చితంగా కష్టపడి నటించాలనే ఆసక్తి కలుగుతుంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలను దేశంలోని అన్ని రాష్ట్రాల వారు చూస్తారు. కనుక నాలాంటి హీరోయిన్స్ ఒక్క సినిమాతో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశంను దక్కించుకుంటున్నారు. ఒక్క భాష సినిమాతో అన్ని భాషల వారిని పలకరించవచ్చు. అన్ని భాషల్లో కూడా పాపులర్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం దేశంలో సినిమాను చూస్తారు కనుక తక్కువ సమయంలో ఎక్కువ పాపులారిటీని దక్కించుకోవచ్చు. అందుకే పాన్‌ ఇండియా సినిమా ఆఫర్లు నాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని సద్వినియోగం చేసుకునేందుకు నావంతు ప్రయత్నాలు చేస్తాను అన్నట్లుగా లాజిక్‌ గా ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

శృతి హాసన్‌ హీరోయిన్‌ గా కేవలం సలార్‌ మాత్రమే కాకుండా ఇంకా పలు సినిమాలు రూపొందుతున్నాయి. హిందీ మరియు ఇతర భాషల్లో వరుసగా ఈ అమ్మడికి ఆఫర్లు వస్తున్నాయి. అయితే వచ్చిన ప్రతి ఆఫర్ కు పచ్చ జెండా అన్నట్లుగా కాకుండా ఆచి తూచి అన్నట్లుగా ఈ అమ్మడు సినిమాలను చేస్తోంది. సినిమా లకు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్ లకు కూడా ఈ అమ్మడు ఓకే చెబుతూ వస్తోంది. తెలుగు లో ఈమె నటించిన పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా బాక్సాఫీస్ వద్ద ఈమె నటించిన మరిన్ని సినిమాలు విడుదల అవుతాయి అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.