Begin typing your search above and press return to search.

మీరు ఆ పని ఎందుకు చేయరు?.. అంటున్న శృతి హాసన్

By:  Tupaki Desk   |   16 April 2020 6:13 PM GMT
మీరు ఆ పని ఎందుకు చేయరు?.. అంటున్న శృతి హాసన్
X
హీరోయిన్లు చాలామందే ఉంటారు కానీ వారందరూ ఒక తీరు.. శృతిహాసన్ ఒక తీరు. ఈ విషయం అర్థం కావడానికి బీకాం ఫిజిక్స్ పాఠాలు ఏమీ అవసరం లేదు. మామూలు డిగ్రీలు చదివినా చాలు. మనసుకు నచ్చింది పైకి చెప్పడం.. ఏ విషయం పైన అయినా పెద్దగా ఆలోచించకుండా సమాధానం ఇవ్వడం.. ఒకవేళ వివాదంగా మారితే దానికి కూడా తోచినట్టు క్లారిఫికేషన్ ఇవ్వడం ఇదంతా శృతి కి వెన్నతో పెట్టిన విద్య. నిజానికి శృతి నాన్నగారు కమల్ హాసన్ గారు.. తన వారసత్వంగా ఇలాంటి లక్షణాలను శృతికి ఇచ్చాడని కొంతమంది కామెంట్లు కూడా చేస్తుంటారు.

ఈ తరంలో మందు తాగే అలవాటు చాలామందికి ఉంది. అయితే ఆ విషయం ఓపెన్ గా ఒప్పుకునే ఘటికులను మాత్రం వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. శృతి అలాంటి 'ది గ్రేట్ ఘటి కురాలు'. శృతి అప్పట్లో ఒకసారి ఓ ఇంటర్వ్యూలో "ఆదేమైనా పెద్ద విషయమా. నాకు విస్కీ అలవాటు ఉంది" అంటూ షాక్ ఇచ్చింది. ఈ షాక్ కు చాలామంది జనాల బుర్ర తిరిగింది. కొంతకాలం తర్వాత.. అంటే ఈ మధ్యనే నేను మందు మానేశానని మరోసారి షాక్ ఇచ్చింది.

ఈమధ్య ఇదే విషయంపై శ్రుతిని "ఎందుకు మీరు మందు మానేశారు?" అని ప్రశ్నిస్తే..మరోసారి ఆసక్తికరమైన జవాబు ఇచ్చింది. "నా స్నేహితులతో కలిసి ఒకరోజు రాత్రంతా పార్టీ చేసుకున్నాను. అయితే ప్రతి శనివారం తీసుకునే మోతాదు కంటే చాలా ఎక్కువ తీసుకున్నాను. నా జీవితానికి ఇక ఇది చాలు అనిపించింది. ఇక జన్మలో ముట్టుకో కూడదని నిర్ణయం తీసుకున్నాను. మద్యం మంచిదా కాదా అనేది నేను ఇక్కడ చెప్పబోవడం లేదు. కానీ అది మానేసిన తర్వాత మాత్రం నా జీవితం మెరుగ్గా ఉంది అని ఫీల్ అవుతున్నాను" అంటూ సమాజానికి మద్యపాన వ్యతిరేక సందేశం ఇచ్చింది.

"మీరు ఈ వివాదాలు.. ట్రోల్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?" అని అడిగితే మరో ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. "ఒక మగవాడు తాగితే ఎవరు ఏం మాట్లాడరు. అదే ఒక మహిళ తాగితే అదో వివాదంగా మారుతోంది. అది బాధాకరం. మీకో విషయం తెలుసా? కొన్ని పల్లెటూర్లలో భర్తలు కొట్టే దెబ్బలకు తట్టుకోవడానికి మహిళలు తరచుగా మద్యం సేవిస్తారు. మీరు అలాంటి అంశాలను ఎందుకు లేవనెత్తరు?"అంటూ తిరిగి ప్రశ్నించింది. అసలే కరోనా దెబ్బకు ప్రతి ఒక్కరూ కకావికలైపోయారు. ఇప్పుడు ఇలాంటి సమాజ సేవలు చేసే ఓపిక చాలా తక్కువ మందికి ఉంటుంది. శృతి ఏమో అలాంటి సమాజ సేవ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఆ దిశగా ఏదైనా ఉద్యమం మొదలు పెట్టొచ్చు.