Begin typing your search above and press return to search.

ఊపిరికి హ్యాండిచ్చినా మ‌రో ఛాన్స్

By:  Tupaki Desk   |   11 Dec 2019 1:29 PM GMT
ఊపిరికి హ్యాండిచ్చినా మ‌రో ఛాన్స్
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ - వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో వ‌చ్చిన‌ మ‌హ‌ర్షి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌రువాత‌ స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రీక‌ర‌ణ‌లో మ‌హేష్‌ బిజీగా ఉన్నారు. మ‌హేష్ కెరీర్ 26వ చిత్ర‌మిది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ సాగుతున్న స‌మ‌యంలో మ‌హేష్ 27 చిత్రానికి స్క్రిప్టును రెడీ చేశాడు వంశీ పైడిప‌ల్లి. మ‌హ‌ర్షి (మ‌హేష్ 25) త‌ర్వాత మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ తీయాల‌న్న పంతంతో ఉన్నాడు.

అందుకు త‌గ్గ‌ట్టే ఈసారి మ‌హేష్ ని కొత్త‌గా ప్రెజెంట్ చేయ‌నున్నాడ‌ట‌. ఒక గ్యాంగ్ స్టార్ గా చూపించనున్నాడన్న ప్ర‌చారం సాగుతోంది. సూప‌ర్ స్టార్ ఇంత‌కుముందెన్న‌డూ చేయని క్యారెక్ట‌రైజేష‌న్ ని రెడీ చేశాడ‌ని ఇటీవ‌ల‌ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అలాగే తాజా స‌మాచారం ప్ర‌కారం... ఈ చిత్రంలో అందాల శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌గా న‌టించ‌నుంద‌ని చెబుతున్నారు. శ్రుతి ఇంత‌కుముందు శ్రీ‌మంతుడు చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న న‌టించింది. ఇప్పుడు రెండోసారి మ‌హేష్ స‌ర‌స‌న న‌టింప‌జేసేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ట‌.

అయితే శ్రుతితో వంశీ పైడిప‌ల్లికి గ‌త చేదు అనుభ‌వాన్ని ఈ సంద‌ర్భం గా గుర్తు చేసుకోవాల్సిందే. నాగార్జున‌- కార్తీ హీరోలుగా వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కించిన `ఊపిరి` చిత్రానికి సంత‌కం చేసిన ఈ భామ స‌రిగ్గా లాంచింగ్ కి రెండ్రోజుల ముందు ప్రాజెక్టు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దాంతో పైడిప‌ల్లి- పీవీపీ బృందం షాక్ తిన్నారు. ఆ చిత్ర నిర్మాత పీవీపీ శ్రుతి పై చాంబ‌ర్ - నిర్మాత‌ల మండ‌లికి ఫిర్యాదు చేశారు. అప్ప‌ట్లో శ్రుతి యారొగెన్సీపైనా నిర్మాత పీవీపీ సీరియ‌స్ అయ్యార‌న్న ముచ్చ‌టా సాగింది. అయితే ఒక‌సారి దెబ్బ తిని కూడా వంశీ తిరిగి శ్రుతి హాస‌న్ కి అవ‌కాశం క‌ల్పిస్తున్నారా? అంటూ ఇప్పుడు కొత్త‌గా డిస్క‌ష‌న్ మొద‌లైంది. అయితే శ్రుతి హాస‌న్ ఎంపిక‌ను వంశీ కానీ చిత్ర‌బృందం కానీ ఇంకా ధృవీక‌రించాల్సి ఉంది.