Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: సిల్క్‌ త‌ర్వాత సైనా కూడా?

By:  Tupaki Desk   |   25 Sep 2018 6:33 AM GMT
ట్రెండీ టాక్‌: సిల్క్‌ త‌ర్వాత సైనా కూడా?
X
ఎట్ట‌కేల‌కు సైనా నెహ్వాల్ బ‌యోపిక్ ప్రారంభ‌మైంది. ఈనెల 22న లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ చిత్రం ప్రారంభ‌మైంద‌ని ప్ర‌ఖ్యాత బాలీవుడ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ తెలిపారు. హైద‌రాబాదీ అమ్మాయి - బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా పాత్ర‌లో `సాహో` బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ న‌టిస్తోంది. ఆమోల్ గుప్తా ద‌ర్శ‌క‌త్వంలో టీ సిరీస్ భూష‌ణ్ కుమార్ ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

క్రీడాకారిణి బ‌యోపిక్ అంటే ఆషామాషీనా? ముంద‌స్తు ప్రిప‌రేష‌న్ అవ‌స‌రం. అందుకే సైనా జీవిత‌క‌థ‌లో న‌టించే ముందే శ్ర‌ద్ధా క‌పూర్ అవ‌స‌రం మేర బ్యాడ్మింట‌న్‌ లో శిక్ష‌ణ తీసుకుంది. ఇదివ‌ర‌కూ సైనా గురువు పుల్లెల గోపిచంద్ వ‌ద్ద హైద‌రాబాద్‌ పుల్లెల బ్యాడ్మింట‌న్‌ అకాడెమీలో త‌ర్ఫీదు పొందిన సంగ‌తి తెలిసిందే. ఓవైపు సాహో చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటూనే మ‌రోవైపు శ్ర‌ద్ధా ఈ పాత్ర కోసం చాలానే ప్రీప్రాక్టీస్ చేసింది. ఇక శ్ర‌ద్ధా న‌టించిన రీసెంట్ సినిమాలు స్త్రీ - బ‌ట్టి గుల్ మీట‌ర్ చాలు బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని విజ‌యాలు ద‌క్కించుకోవ‌డంతో ఆ హుషారులో సైనా ఈ బ‌యోపిక్‌ లో న‌టించేందుకు ప్రిపేర‌వ్వ‌డం బాలీవుడ్‌ లో చ‌ర్చ‌కొచ్చింది.

సైనా తెలుగ‌మ్మాయి కాబ‌ట్టి, అటు ఉత్త‌రాదితో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ బ‌యోపిక్‌ పై ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. న‌వ‌త‌రంలో మేటి క్రీడాకారిణిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకుంది కాబ‌ట్టి ఈ చిత్రాన్ని అన్ని భాష‌ల్లోనూ రిలీజ్ చేసేందుకు టీ-సిరీస్ ప్లాన్ చేస్తోందిట‌. ఇదివ‌ర‌కూ తెలుగ‌మ్మాయి విజ‌య‌ల‌క్ష్మి అలియాస్ సిల్క్‌ స్మిత జీవిత‌క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కించి బాలీవుడ్ లేడీ డైన‌మైట్‌ ఏక్తా క‌పూర్ 100 కోట్లు ఆర్జించారు. ఈసారి కూడా మ‌రో తెలుగ‌మ్మాయి బ‌యోపిక్‌ ని బాలీవుడ్ వాళ్లే నిర్మిస్తున్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌క‌ టీసిరీస్ అధినేత భూష‌ణ్ బ‌యోపిక్ బూచీతో ఏ స్థాయిలో బిజినెస్ చేయనున్నారో అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ మార్కెట్ వ‌ర్గాల్లో సాగుతోంది. అలానే సానియా మీర్జా బ‌యోపిక్‌ ని బాలీవుడ్‌ లో ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ త‌ర‌హాలో మ‌న తెలుగు ప్ర‌తిభావ‌నుల క‌థ‌ల్ని ఎంచుకునే తెలివితేట‌లు మ‌న‌కు ఏక్క‌డున్నాయి? అంటూ కొన్ని విమ‌ర్శ‌ల్ని టాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాతలు ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఈ త‌ర‌హా ఆలోచ‌న‌లు మ‌న మ‌న‌వాళ్ల‌కు చేత‌కావా? అన్న విమ‌ర్శ‌ల‌కు మ‌న‌వాళ్లు ఏమ‌ని స‌మాధానం చెబుతారో చూడాలి.