Begin typing your search above and press return to search.

హసీనా సినిమా అట్టర్ ఫ్లాపే

By:  Tupaki Desk   |   23 Sept 2017 10:49 AM IST
హసీనా సినిమా అట్టర్ ఫ్లాపే
X
సినిమా పరిశ్రమలో హీరోలకు మరియు హీరోయిన్స్ కి ఒక్క అపజయం వస్తే చాలు.. వారు తీసే నెక్స్ట్ సినిమాపై ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. దీంతో ఎవ్వరైనా సరే చాలా జాగ్రత్తగా అడుగు వేస్తారు. హీరోలది ఎలాగైనా చెల్లిపోతుంది. కానీ హీరోయిన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక వేళ హిట్ కాకపోయినా నటనపరంగా మంచి ప్రశంసలను ఆదుకోవాలి. అలా అయితేనే నెక్స్ట్ అవకాశాలు రావడానికి వీలుపడుతుంది.

అయితే అదే తరహాలో ఇప్పుడు శ్రద్దా కపూర్ కొంచెం అపజయంతో సతమతమవుతోంది. అమ్మడు ప్రభాస్ సాహో సినిమాలో సెలెక్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటోంది. ఇక అసలు విషయానికి వస్తే శ్రద్దా మెయిన్ లీడ్ లో నటించిన హసీనా పార్కర్ శుక్రవారం విడుదలైంది. అయితే ఈ సినిమాపై విడుదలకి ముందే భారీ అంచనాలను నమోదు చేసుకుంది. ఎందుకంటే మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కడంతో అందరిని ఆకర్షించింది.

విచిత్రం ఏంటంటే.. ఈ సినిమా మొదటి ఆటకే భారీ డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొంది. కథలో ఏ మాత్రం ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవడంతో ప్రేక్షకుడు తిప్పి కొట్టాడు. అయితే ఇప్పుడు అమ్మడు నటిస్తున్న సాహో సినిమాపై ప్రభావం చూపుతోందా అనే కామెంట్స్ వినబడుతున్నాయి. సర్లేండి.. అక్కడ తీసింది మాఫియా క్వీన్ కథ కాబట్టి.. మనోళ్ళకు పెద్దగా ఎక్కి ఉండదు. కాని సాహో సినిమా స్టయిలే వేరే. మరి ఈ సినిమాతో శ్రద్దా ఎంతవరకు లాభాన్ని అందుకుంటుందో చూడాలి.