Begin typing your search above and press return to search.

ఓవర్ సీస్ మార్కెట్ గురించి మర్చిపోవాల్సిందేనా..?

By:  Tupaki Desk   |   26 Dec 2020 11:30 PM GMT
ఓవర్ సీస్ మార్కెట్ గురించి మర్చిపోవాల్సిందేనా..?
X
కరోనా ప్రభావం నేపథ్యంలో మూతబడిపోయిన థియేటర్స్ రీ ఓపెన్ అవడంతో కొత్త సినిమాలు విడుదల తేదీలను ప్రకటిస్తూ వస్తున్నారు. అయితే తెలుగు సినిమా బిజినెస్ కి ఆయువుపట్టు లాంటి ఓవర్ సీస్ మార్కెట్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయనే అనుమానం సినీ వర్గాల్లో ఉంది. ఎందుకంటే మన సినిమాలు ఎక్కువగా ఓవర్ సీస్ బిజినెస్ పైనే ఆధారపడుతుంటాయి. అక్కడ విడుదలైన ప్రతి సినిమా కూడా భారీ వసూళ్లను రాబడుతుంటాయి. కొన్ని సినిమాలు రెవిన్యూ పరంగా ఇక్కడ దెబ్బతిన్నప్పటికీ.. ఓవర్ సీస్ కలెక్షన్స్ వల్ల బయటపడుతుంటాయి. 'బాహుబలి' 'ఫిదా' 'రంగస్థలం' 'అల వైకుంఠపురంలో' వంటి సినిమాలు మిలియన్ల కొలదీ వసూళ్లు రాబట్టాయి. అయితే కోవిడ్-19 కారణంగా ఓవర్ సీస్ మార్కెట్ పై గట్టి దెబ్బ పడింది.

తెలుగు రాష్ట్రాల్లో సుమారు పది నెలల తర్వాత 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాతో థియేటర్స్ పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ - నభా నటేష్ జంటగా నటించిన ఈ మూవీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుబ్బు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌‌ పై బీవీఎస్ఎన్‌ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ వారు విడుదల చేశారు. 50శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సుమారు 4.7 కోట్ల గ్రాస్ తో ఇండియా వైడ్ మొత్తం కలిపి 5.1 కోట్లు రాబట్టింది. కాకపోతే ఈ సినిమాకి ఓవర్ సీస్ లో ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ లేకపోవడమే కాస్త నిరాశాజనకమని చెప్పవచ్చు. యూఎస్ - ఆస్ట్రేలియా లలో లిమిటెడ్ స్క్రీన్ లో మినగా మిగతా దేశాలతో సోలో బ్రతుకే సినిమా రిలీజ్ ప్రదర్శించబడలేదని తెలుస్తోంది. దీని వల్ల ఈ సినిమా ఓవర్ సీస్ కలెక్టన్స్ కి గండి పడినట్లయింది. ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఒకప్పటిలా సినిమాలకు ఓవర్ సీస్ మార్కెట్ జరగాలంటే చాలా సమయమే పట్టేలా ఉంది. అప్పటి వరకు నిర్మాతలు ఓవర్ సీస్ మార్కెట్ గురించి మర్చిపోవాల్సిందే.