Begin typing your search above and press return to search.

రియా చక్రవర్తి ఆ ఛానల్స్ పై లీగల్ గా పోరాడనుందా...?

By:  Tupaki Desk   |   9 Oct 2020 2:15 PM IST
రియా చక్రవర్తి ఆ ఛానల్స్ పై లీగల్ గా పోరాడనుందా...?
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయిన తర్వాత ఆ కేసులో ఎక్కువగా వినిపించిన పేరు రియా చక్రవర్తి. సుశాంత్ మరణించిన నెల రోజులకు 'నేను సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియాని.. సుశాంత్ కి ఏమి జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను.. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు చేపట్టండి' అంటూ బయటకు వచ్చింది. అయితే అనూహ్యంగా సుశాంత్ సూసైడ్ కేసు రియా మెడకే చుట్టుకుంది. సుశాంత్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో రియా పై బీహార్ పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. అక్కడి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ మిస్టరీ థ్రిల్లర్ ని తలపించేలా కొనసాగింది. అనేక పరిణామాల మధ్య ఈ కేసుని సీబీఐ మరియు ఈడీ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసాయి. అదే క్రమంలో డ్రగ్స్ కోణం బయటకు రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి రియాని అరెస్ట్ చేసింది. అయితే రియా పేరు ఈ కేసులో బయటకు రావడంతో కొన్ని జాతీయ మీడియా ఛానల్స్ ఆమెను టార్గెట్ చేస్తూ అనేక కథనాలను ప్రసారం చేసాయి.

ఏది నిజమో ఏది అబద్దమో అని ప్రజలు ఆలోచించుకునే సమయం లేకుండా వరుస కథనాలతో ఉక్కిరిబిక్కిరి చేసాయి. ఒకపక్క సీబీఐ - ఎన్సీబీ దర్యాప్తు చేస్తుంటే కొన్ని నేషనల్ ఛానల్స్ స్వయంగా రంగంలోకి దిగి ఈ కేసుని దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసేశాయి. అయితే వారు వెల్లడించిన విషయాల్లో నిజానిజాలు ఇంకా సీబీఐ వెల్లడించినప్పటికీ.. గత నెల రోజులుగా రియా పైనే నేషనల్ మీడియా ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు 28 రోజుల జైలు జీవితం గడిపిన రియా చక్రవర్తి షరతులతో కూడిన బెయిల్ పై విడుదలైంది. రూ.లక్ష వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు.. వరుసగా పది రోజులపాటు స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో రియా హాజరుకావాలని.. ఆరు నెలల పాటు నెలకోసారి ఎన్సీబీ ఎదుట హాజరు కావాలని.. పాస్‌ పోర్టును అప్పగించాలని.. దేశం విడిచి వెళ్లకూడదని.. గ్రేటర్ ముంబై దాటి వెళ్లాలంటే ముందే సమాచారం ఇవ్వాలని షరతులు విధించింది. అయితే ఇప్పుడు రియా చక్రవర్తి నెల రోజులుగా తనను లక్ష్యంగా చేసుకుని కథనాలు ప్రసారం చేస్తున్న కొన్ని నేషనల్ ఛానల్స్ పై చట్టబద్ధంగా పోరాడాలని నిర్ణయించుకుందట. సీబీఐ విచారణ జరుగుతున్న క్రమంలో రియా నే దోషి అనే విధంగా జనాల్లోకి తీసుకెళ్లారని సదరు ఛానల్స్ పై లీగల్ యాక్షన్ తీసుకోనుందట. మరోవైపు సుశాంత్ ది హత్య కాదని ఆత్మహత్య అని ఎయిమ్స్ బృందం నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.