Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో స్టొరీ రైటర్లు లేరా?

By:  Tupaki Desk   |   3 Sept 2019 7:00 AM IST
టాలీవుడ్ లో స్టొరీ రైటర్లు లేరా?
X
ఇప్పుడు తెలుగు సినిమాకు కథల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక్కడ రచయితలే లేనట్టు రాసేవాళ్ళే దొరకనట్టు లక్షలు కోట్లు పోసి మరీ కొరియన్ హాలీవుడ్ చైనీస్ ఫిలిప్పైన్స్ ఎక్కడెక్కడో ప్రపంచం నలుమూలల నుంచి వెతికి మరీ కొనుక్కుని వస్తున్నారు. సరే ఇంతా చేశారు కదా ఇవేమైనా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపి కాసుల వర్షం కురిపిస్తున్నాయా అంటే అంత సీన్ లేదు. ఒకటి రెండు తప్పించి అన్ని డిజాస్టర్లకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోతున్నాయి.

ఆఖరికి పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందంటే ఒకే పర బాషా సినిమాను పోటీ పడి మరీ స్టార్ హీరోల సినిమాలకు వాడేసుకున్న దర్శకులు దాన్ని తమ స్వంత తెలివిగా చెప్పుకునే దాకా. పైగా స్ఫూర్తి అని లేదా ఒకే ఆలోచన సృష్టిలో ఏ ఇద్దరికైనా ఒకేలా రావొచ్చు కదా అనే లాజిక్ తో సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని ఫలితంగా అటు ప్రేక్షకుల్లోనూ అభిమానుల్లోనూ చులకన అవ్వడం తప్ప ఇంకే ప్రయోజనం కనిపించడం లేదు. అసలు నిజంగా తెలుగు రైటర్స్ లో క్రియేటివిటీ అంత గొడ్డు పోయిందా అంటే అదేమి కాదు.

హీరోల చుట్టూ ఉండే కోటరీలు కావొచ్చు లేదా సదరు స్టార్లకే కొత్త రచయితలతో రిస్క్ ఎందుకులే అని భయపడటం కావొచ్చు కారణం ఏదైనా నిజంగా మంచి కథలు రాసుకున్నవాళ్ళు అవి సూట్ అయ్యే హీరోల దాకా వెళ్లే మార్గం తెలియక హైదరాబాద్ లోనే తిరుగాడుతున్న బ్యాచ్ లక్షల్లో ఉన్నారు. ఐడియాలను ఆకర్శించే దిశగా మన నిర్మాతలు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఎంతసేపు కాంబినేషన్ల మీద పెడుతున్న శ్రద్ధ ఇంకోదాని మీద ఉండటం లేదు. ఇది మారనంత కాలం కథలకు ఇలా కొరత వస్తూనే ఉంటుంది.