Begin typing your search above and press return to search.

ప్రభాస్ ఫ్యాన్స్ కు 'చిన్న సినిమా' ఎగ్జైటింగ్ న్యూస్‌

By:  Tupaki Desk   |   16 April 2022 7:31 AM GMT
ప్రభాస్ ఫ్యాన్స్ కు చిన్న సినిమా ఎగ్జైటింగ్ న్యూస్‌
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్‌ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకుంటుందని భావించిన రాధేశ్యామ్‌ నిరాశ పర్చింది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన రాధేశ్యామ్‌ సినిమా సక్సెస్ అయితే వెంటనే మారుతి దర్శకత్వంలో దానయ్య నిర్మాణంలో ప్రభాస్ నుండి కొత్త సినిమా ప్రకటన వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

ప్రభాస్ తో కేవలం రెండు నెలల్లోనే ఒక సినిమాను పూర్తి చేసేందుకు గాను ఒక స్క్రిప్ట్‌ ను ఇప్పటికే ప్రభాస్ రెడీ చేశాడు. ఆ సినిమా పేరే రాజా డీలక్స్‌. టైటిల్‌ విషయంలో కాస్త తర్జన బర్జనాలు జరుగుతున్నా సినిమా మాత్రం పక్కాగా షురూ కాబోతుంది అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని రాధేశ్యామ్‌ సినిమా ఫలితంతో ప్రభాస్ నిర్ణయం మార్చుకున్నాడనే పుకార్లు షికార్లు చేయడం మొదలు అయ్యింది.

రాజా డీలక్స్ సినిమా అటకెక్కింది అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు ఒకింత నిరుత్సాహంతో ఉన్నారు. ఈ సమయంలోనే మారుతి సన్నిహిత వర్గం నుండి అందుతున్న సమాచారం ప్రకారం మారుతి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పక్కా కమర్షియల్‌ మూవీ విడుదలకు సిద్దంగా ఉంది.

పక్కా కమర్షియల్‌ సినిమా విడుదల అయిన వెంటనే మారుతి దర్శకత్వంలో సినిమాను ప్రభాస్‌ చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో రూపొందబోతున్న సినిమా విడుదల కూడా మరీ ఆలస్యం కాకుండా ఇదే ఏడాది చివర్లో ఉంటుందని అంటున్నారు. ప్రభాస్ చిన్న సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఏడాది చివర్లోనే ప్రభాస్ నుండి ఆ చిన్న సినిమా రాబోతుందనే వార్తలు ఆయన అభిమానులకు ఖచ్చితంగా ఎగ్జైటింగ్‌ గా అనిపిస్తాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల్లోనే చిత్రీకరించినా కూడా మరీ లో బడ్జెట్‌ తో కాకుండా భారీగానే ఖర్చు పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి చాలా సినిమాలు ఉన్న కారణంగా ఇదే ఏడాది డిసెంబర్‌ లో రాజా డీలక్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.