Begin typing your search above and press return to search.

శివాజీ రాజా బిగ్గెస్ట్ మిస్టేక్

By:  Tupaki Desk   |   9 April 2019 5:09 AM GMT
శివాజీ రాజా బిగ్గెస్ట్ మిస్టేక్
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల్లో శివాజీ రాజా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ప్రచారం ఆద్యంతం శివాజీ రాజా ఎంతో ఎమోషన్ అయ్యారు. పైగా ప్రత్యర్థి సీనియర్ నరేష్ పై ఎంతో సీరియస్ అయిన శివాజీరాజా తన గెలుపు ఖాయం అని అనుకున్నారు. మా అధ్యక్ష పదవిలో ఉన్న రెండేళ్ల కాలంలో తాను చేసిన సంక్షేమ పథకాలు తనని కాపాడతాయని గుడ్డిగా నమ్మాడు. అయితే ఎన్నికల ముందు చివరి నాలుగు రోజుల్లో సీన్ మొత్తం మారిపోయింది. ఆర్టిస్టులంతా రివర్స్ గేర్ లో నరేష్ కి ఓట్లు వేసి గెలిపించడంతో తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది అన్న చందంగా రివర్స్ అయిపోయింది. అయితే ఈ సన్నివేశాన్ని శివాజీ రాజా ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారని అర్థమవుతోంది. అందుకు తాజాగా అతడి చర్యల్ని ప్రత్యక్ష ఉదాహరణలుగా చూపెడుతున్నారు కొందరు.

నిన్నటిరోజున శివాజీ రాజా మీడియా ముందుకు వచ్చి నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇదే అంటూ తనకు తోచిందల్లా మీడియా ముందు మాట్లాడారు. ఇదివరకూ సీనియర్ నరేష్ గెలిచిన అనంతర వివాదాల్లోనూ మీడియా ముందుకొచ్చి శివాజీ రాజా మాట్లాడారు. కానీ ఇప్పుడు తన ఓటమికి కారకుడని భావించి ఏకంగా మెగా బ్రదర్ నాగబాబుపైనే తన అక్కసును వెల్లగక్కడం ప్రధానంగా చర్చకు వచ్చింది. నాగబాబు జనసేన తరపున నరసాపురంలో పోటీ చేస్తున్నారు.. అక్కడ ఎవరూ ఓటేయొద్దు.. పిల్లికి భిక్షం పెట్టని తత్వం అతడిది అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. అయితే నాగబాబును విమర్శించే క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ లతో తనకు ఏమాత్రం వైరం లేదని ప్రత్యేకంగా గుచ్చి చెప్పేందుకు శివాజీ రాజా ప్రయత్నించారు. కానీ ఆ సన్నివేశం అంతా టీవీల్లో చూసినవాళ్లకు శివాజీ రాజా కామెడీలు చేస్తున్నాడా? అంటూ సందేహం వ్యక్తమైంది.

అన్నయ్యను తిడితే తమ్ముడు ఊరుకుంటాడా? పవన్ అంటే అభిమానం అన్నంత మాత్రాన నాగబాబును తిట్టిన వాడిని పవన్ ఊరుకుంటారా? పైగా జనసేన తరపున నాగబాబు పోటీ చేస్తున్నప్పుడు పవన్ ని అన్నట్టే కదా? ఆ లాజిక్ ని శివాజీ రాజా మిస్సయ్యాడా? తెలిసే తప్పు చేశాడా? అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక తన తమ్ముడిని అన్నందుకు చిరంజీవి సైతం ఈ మ్యాటర్ ని తేలిగ్గా వదిలేస్తారా? అసలు తనకు ఏమాత్రం కలిసిరాని.. ప్రయోజనం లేని సమయంలో శివాజీ రాజా ఇలా మీడియా ముందుకు వచ్చి నాగబాబుపై ఫైర్ అవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఓటమి పాలయ్యాక ఏం చేసినా ఏం ఉపయోగం? అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో ఆసక్తికర డిబేట్ సాగుతోంది. ఎన్నికల్లో నాగబాబు వల్లనే ఓడిపోయానన్న వ్యథతో శివాజీ రాజా ఇలా బరస్ట్ అయిపోయారు. కానీ ఏకంగా మెగా ఫ్యామిలీతో సత్సంబంధాల్ని చెడగొట్టుకున్నారు అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మొన్నటివరకూ చిరంజీవి - పవన్ కి శివాజీ రాజా సన్నిహితుడుగా ఉండి ఇప్పుడిలా విరోధి అయిపోయాడు. ఘోర తప్పిదం చేశాడంటూ మెగా ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. శివాజీ రాజా బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. అతడు పరిశ్రమలో మనుగడ సాగించాలి అంటే మెగా సాయం తప్పనిసరి. అన్నయ్య ఆశీస్సులు కావాలి. పైగా శివాజీ రాజా తన కొడుకుని పరిశ్రమకు పరిచయం చేశాడు. ఇలాంటి రాంగ్ టైమ్ లో ఇలా మెగా ఫ్యామిలీలో కీలక వ్యక్తిపై రాజకీయాల పరంగా కామెంట్ చేయడాన్ని జీర్ణించుకోలేనిది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.