Begin typing your search above and press return to search.

అన్నదమ్ములుగా నాని - జగపతిబాబు తెరపై పండగచేస్తారట!

By:  Tupaki Desk   |   27 March 2021 4:56 PM GMT
అన్నదమ్ములుగా నాని - జగపతిబాబు తెరపై పండగచేస్తారట!
X
నాని కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' సినిమా రూపొందింది. సాహు గారపాటి - హారీశ్ పెద్ది ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో, రీతూ వర్మ కథానాయికగా అలరించనుంది. మరో ముఖ్యమైన పాత్రలో ఐశ్వర్యరాజేశ్ కనిపించనుంది. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో 'టక్ జగదీష్' పరిచయ వేడుక పేరుతో ఒక ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కోవిడ్ పరిస్థితుల్లో కూడా వందలాదిమంది ఈ వేడుకకి తరలిరావడం విశేషం.

ఈ వేదికపై దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ .. "ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తారని నేను ఎంతమాత్రం ఊహించలేదు .. అందరికీ కూడా నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. కోవిడ్ పరిస్థితుల్లో నేను ఇంతమంది ఆర్టిస్టులతో ఈ సినిమా చేయడం వెనుక నిర్మాతలతో పాటు అందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ఈ సినిమాలో నాని - జగపతిబాబు అన్నదమ్ములుగా కనిపిస్తారు. తెరపై వాళ్లని అలా చూడటం ప్రేక్షకులందరకీ ఒక పండుగలా అనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ .. యాక్షన్ తో కూడుకున్న ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం నాకు ఉంది.

'టక్ జగదీష్' రిలీజ్ వరకూ ప్రతివారం ఈ సినిమాకి సంబంధించిన సెలబ్రేషన్ జరుగుతూనే ఉంటుంది. రెండున్నర గంటల నిడివి కలిగిన ఈ సినిమాలో నాని చాలా కొత్తగా కనిపిస్తాడు .. ఆయన పాత్ర మీ కుటుంబ సభ్యుడిలా అనిపిస్తుంది. కొంతమందికి కులపిచ్చి .. కొంతమందికి డబ్బుపిచ్చి .. ఇంకొంతమందికి పేరు పిచ్చి ఉంటుంది. మా 'టక్ జగదీష్' కి మాత్రం కుటుంబం అంటే పిచ్చి. ఆ పిచ్చి మీకుంటే ఈ సినిమాలోని పాత్రలన్నీ మీకు కనెక్ట్ అవుతాయి. ఇంకా చాలా చెప్పాలని ఉంది. కానీ వరుసగా ఈవెంట్స్ జరగనున్నాయి గనుక, ఎక్కువ విషయాలను రివీల్ చేయలేకపోతున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.