Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్స్ సిరీస్.. హిందువులు హ‌ర్టా?

By:  Tupaki Desk   |   6 Sep 2019 8:25 AM GMT
నెట్ ఫ్లిక్స్ సిరీస్.. హిందువులు హ‌ర్టా?
X
డిజిట‌ల్ సినిమా మీడియం వేగంగా విస్త‌రిస్తోంది. భ‌విష్య‌త్తు వీటిదే అనే సంకేతాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఈ విప్ల‌వంలో నెట్ ఫ్లిక్స్ ది కీల‌క పాత్ర‌. వెబ్ సిరీస్ కాన్సెప్ట్ ఊపందుకునేలా చేసింది ఈ సంస్థే. ఇప్ప‌టికే ఈ సంస్థ వెబ్ సిరీస్ ల మీద‌ వంద‌లు వేల కోట్ల పెట్టుబ‌డులు పెడుతోంది. ఇండియ‌న్ మార్కెట్ మీద కూడా గ‌ట్టిగానే దృష్టిసారించిన ఈ సంస్థ‌.. ఇప్ప‌టికే ప‌లు వెబ్ సిరీస్ ల‌ను రూపొందించింది. ఐతే సెన్సార్ గ‌డప తొక్కాల్సిన అవ‌స‌రం లేని ఈ వెబ్ సిరీస్ ల్లో కంటెంట్ విష‌యంలో హ‌ద్దులు దాటిపోతున్నార‌ని.. హిందువుల్ని కించ‌ప‌రిచే అంశాలతో ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు మొద‌ల‌య్యాయి.

శివ‌సేన పార్టీకి చెందిన ఐటీ సెల్ లీడ‌ర్ ర‌మేష్ సోలంకి నెట్ ఫ్లిక్స్ మీద పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. సేక్రెడ్ గేమ్స్ రెండో భాగంలో హిందువుల్ని కించ‌ప‌రిచే స‌న్నివేశాలున్నాయ‌ని ఆయ‌న ఆరోపించాడు. అహం బ్ర‌హ్మాస్మి అనే మాట‌ను త‌మాషా చేశార‌ని.. హిందూ స్వామీజీల్ని ఇందులో చెడుగా చూపించార‌ని అన్నాడు. మ‌రోవైపు రాధికా ఆప్టే ప్ర‌ధాన పాత్ర‌లో నెట్ ఫ్లిక్స్ రూపొందించిన గౌల్ అనే సిరీస్ లో భార‌త సైన్యాన్ని కించ ప‌రిచేలా స‌న్నివేశాలున్న‌ట్లు ర‌మేష్ ఆరోపించాడు. నెట్ ఫ్లిక్స్ లోనే ప్ర‌సార‌మ‌వుతున్న ప్యాట్రియాట్ యాక్ట్ అనే కామెడీ షోలో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు మీద సెటైర్లు వేశార‌ని.. ఈ ప్రోగ్రాంల‌న్నింటినీ ర‌ద్దు చేయ‌డంతో పాటు.. నెట్ ఫ్లిక్స్ లో వ‌చ్చే అన్ని సిరీస్ ల‌కూ సెన్సార్ షిప్ ఉండేలా చూడాల‌ని ర‌మేష్ డిమాండ్ చేశాడు.