Begin typing your search above and press return to search.

ఈ సినిమా అగ్గి రాజేసేలా ఉందే..

By:  Tupaki Desk   |   28 Dec 2018 1:30 AM GMT
ఈ సినిమా అగ్గి రాజేసేలా ఉందే..
X
బాలీవుడ్లో ఇప్పుడు అందరి దృష్టీ ఒక వివాదాస్పద సినిమాపై నిలిచింది. ఆ చిత్రమే.. థాకరే. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. థాకరే స్ఫూర్తితో రామ్ గోపాల్ వర్మ ఇంతకుముదే ‘సర్కార్’ సినిమా తీశాడు. అందులో వర్మ పాత్ర చాలా వరకు థాకరే స్ఫూర్తితో తీర్చిదిద్దిందే. కానీ అదొక కల్పిత కథ. కానీ ‘థాకరే’ అలా కాదు. పూర్తిగా బాల్ థాకరే జీవితాన్నే ఇందులో చూపిస్తున్నారు. థాకరే జీవితమంతా వివాదాల మయం. ఆయనో హిందూ అతివాది. ముంబయిలో స్థానికేతరులకు వ్యతిరేకంగా.. మరాఠీయుల కోసం పోరాడాడు. అనేక ఆందోళనల్లో పాల్గొన్నాడు. ఎన్నో గొడవలకు కారణమయ్యాడన్న ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో హిందూ మద్దతుదారులు.. మరాఠీలు ఆయన్ని ఓ హీరోలా చూస్తారు.

ఇంత వివాదాస్పద వ్యక్తి గురించి.. అంతే వివాదాస్పద రీతిలో సినిమా తీసినట్లున్నారు. ‘థాకరే’ ట్రైలర్లో ఎన్నో వివాదాస్పద అంశాలు.. డైలాగులు ఉన్నాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వలేదు. కొన్ని సన్నివేశాలు.. మాటలు తొలగించాలని చెప్పింది. కానీ ఈ చిత్రానికి స్క్రిప్టు అందించిన శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రావూత్‌ అందుకు ససేమిరా అంటున్నారు.‘‘బాల్‌ థాకరే వివాదాస్పద వ్యక్తే కావచ్చు కానీ ఆయన ఆలోచనలు దేశానికి మార్గం నిర్దేశం చేసేలా సాగాయి. ఆయన్ని ఆయనలాగే చూపించాం. మార్పులూ చేర్పులూ చేయడానికి ఇదేమీ ప్రేమ కథ కాదు. బాల్‌ సాహెబ్‌ ఠాక్రే జీవిత కథ. ఎలాంటి తొలగింపులు, మార్పులు ఉండవు’’ అని తేల్చి చెప్పారు. మరి సెన్సార్ బోర్డు ఆదేశాల్ని ధిక్కరించి సినిమా ఎలా రిలీజ్ చేస్తారో చూడాలి. శివసేన నాయకుల తీరు చూస్తుంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత గొడవలు తప్పేలా లేవు.