Begin typing your search above and press return to search.

శింబు 'ది లూప్' విడుదల తేదీ ఖరారు..!

By:  Tupaki Desk   |   22 Nov 2021 10:32 AM GMT
శింబు ది లూప్ విడుదల తేదీ ఖరారు..!
X
తమిళ స్టార్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ''మానాడు''. తెలుగులో ఈ చిత్రాన్ని ''ది లూప్'' అనే పేరుతో విడుదల చేస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. ఇందులో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్.జె సూర్య కీలక పాత్ర పోషించారు. దీపావళి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. అయితే ఇప్పుడు నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు.

ఇప్పటికే విడుదలైన ''ది లూప్'' ప్రచార చిత్రాలు - ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఇది టైమ్ లూప్ కాన్సెప్ట్ తో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలియజేశాయి. ఇందులో శింబు ముస్లిం యువకుడిగా కనిపిస్తుండగా.. అతను ఓ ముఖ్యమంత్రిని చంపే ఘటన రిపీట్ గా జరుగుతున్నట్లు ట్రైలర్ లో చూపించారు. ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఆపడానికి ట్రై చేసే పోలీస్ ఆఫీసర్ గా ఎస్.జె సూర్య కనిపించారు.

తమ జీవితాల్లో ఈ టైం లూప్ జరుగుతున్నట్లు తెలుసుకున్న శింబు - ఎస్.జె సూర్య కలిసి ముఖ్యమంత్రిని ఎలా కాపాడతారు?, అసలు సీఎం ని శింబు ఎందుకు చంపాలని అనుకుంటున్నాడు? టైం లూప్ నుంచి వీరు బయటపడ్డారా లేదా? అనేది తెలియాలంటే ''ది లూప్'' సినిమా చూడాల్సిందే. యాక్షన్ సీక్వెన్స్ లతో ఆద్యంతం థ్రిల్ కి గురి చేయబోతోందని అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం శింబు 27 కేజీల బరువు తగ్గి స్లిమ్ లుక్ లోకి మారిపోయాడు.

విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ ప్రభు.. ''ది లూప్'' అనే మరో వైవిధ్యమైన సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇందులో దర్శకుడు భారతీరాజా - ఎస్.ఏ.చంద్రశేఖర్ - ప్రేమ్ జీ - కరుణాకరన్ - మహేంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. రిచర్డ్ ఎమ్ నాథన్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఉమేష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ చేసిన 100వ సినిమా ఇది. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాచి ఈ చిత్రాన్ని నిర్మించారు.

పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో 'మానాడు' చిత్రాన్ని విడుదల చేయనున్నారు. టాలీవుడ్ మార్కెట్ మీద దృష్టి పెట్టిన హీరో శింబు.. ఇక్కడ కూడా తన సినిమా ప్రమోషనల్ కార్యక్రమా ల్లో పాల్గొంటున్నారు. తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. టైమ్ లూప్ కాన్సెప్ట్ తో రూపొందిన అనేక హాలీవుడ్ చిత్రాలు విశేష ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న శింబు.. ''ది లూప్'' సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.