Begin typing your search above and press return to search.

కళ్యాణ్ రామ్ కర్చీఫ్ వేసేశాడు

By:  Tupaki Desk   |   12 Sept 2015 5:00 PM IST
కళ్యాణ్ రామ్ కర్చీఫ్ వేసేశాడు
X
కళ్యాణ్ రామ్ సడెన్ గా లైన్ లోకి వచ్చేశాడు. అక్టోబరు 9న ఖాళీ పడిందని తెలియగానే కర్చీఫ్ వేసేశాడు. కళ్యాణ్ కొత్త సినిమా ‘షేర్’ ఆ తేదీకే ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి. నిజానికి ఆ రోజు ‘రుద్రమదేవి’ రిలీజవ్వాల్సింది. కానీ వాయిదాల పరంపరను మరోసారి కొనసాగిస్తూ గుణశేఖర్ మరోసారి తన సినిమాను పోస్ట్ పోన్ చేసేశాడు. ఇక ఆ తేదీకి మరో సినిమా ఏదీ స్లాట్ బుక్ చేసుకోలేదు. దీంతో కళ్యాణ్ రామ్ త్వరపడ్డాడు.

ఇంతకుముందు తనతో అభిమన్యు - కత్తి లాంటి ఫ్లాప్ సినిమాలు తీసిన మల్లికార్జున్ మీద నమ్మకముంచి మరో అవకాశమిచ్చాడు కళ్యాణ్ రామ్. అతను చాన్నాళ్ల తర్వాత బయటి బేనర్ లో చేస్తున్న సినిమా ఇది. విజయలక్ష్మి పిక్చర్స్ పతాకంపై కొమర వెంకటేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు విక్రమ్ జీత్ విర్క్ విలన్ రోల్ చేస్తున్నాడు. తమన్ సంగీత దర్శకుడు.

‘పటాస్’తో సూపర్ హిట్ అందుకున్నాక కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా కావడంతో ‘షేర్’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లు కూడా ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఆడియో రిలీజ్ చేసి.. అక్టోబరు 9న భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు కళ్యాణ్ రామ్. ఐతే ‘షేర్’కు ముందు, వెనక భారీ సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరి ఆ పోటీని ఎలా తట్టుకుంటాడో!