Begin typing your search above and press return to search.

'లక్ష్య' క్లైమాక్స్ షూట్ లో శౌర్య..!

By:  Tupaki Desk   |   10 July 2021 5:30 AM GMT
లక్ష్య క్లైమాక్స్ షూట్ లో శౌర్య..!
X
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య కెరీర్ లో వస్తున్న మైలురాయి 20వ చిత్రం ''లక్ష్య''. ఆర్చరీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామాకి ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. నారాయణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహన్ రావు - శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

'లక్ష్య' సినిమాలో నాగశౌర్య ఇంతకముందు ఎన్నడూ కనిపించని విభిన్నమైన లుక్ లో కనిపించనున్నాడు. ఇందులో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా.. విలక్షణ నటుడు జగపతి బాబు - సచిన్ కేడ్కర్ కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమాకు కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుపుకుంటుంది. నాగశౌర్య మరియు జగపతి బాబు తోపాటుగా ఇతర ప్రధాన నటులు ఈ షూట్ లో పాల్గొంటున్నారు.

'లక్ష్య' టీమ్ తాజాగా క్లైమాక్స్ షూట్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది. ఇందులో నాగ శౌర్య ఏకాగ్రతతో లక్ష్యాన్ని కొట్టడానికి విల్లు ఎక్కు పెడుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఈ వీడియో చూస్తుంటే క్లైమాక్స్ సీన్స్ కోసం లావిష్ గా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే 'లక్ష్య' ఇండియాలోనే ఆర్చరీ (విలువిద్య) నేపథ్యంలో రూపొందుతున్న మొట్ట మొదటి సినిమా. దీని కోసం శౌర్య భారీ వర్కౌట్స్ చేసి కండలు తిరిగిన దేహాన్ని రెడీ చేసాడు.

నాగ శౌర్య పుట్టినరోజు సందర్భంగా విడులైన 'లక్ష్య' సినిమా టీజర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఇప్పటి వరకు బయటకొచ్చిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సృజన మణి సంభాషణలు రాస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.