Begin typing your search above and press return to search.

శ్రియ ఇప్పటికీ అంతే అందంగా ఉంది

By:  Tupaki Desk   |   9 Dec 2021 4:30 AM GMT
శ్రియ ఇప్పటికీ అంతే అందంగా ఉంది
X
సాధారణంగా కొన్ని కథలు హీరోను ముందుగా నిలబెట్టి నడుస్తాయి. మరికొన్ని కథలు హీరోయిన్ ను ప్రధానంగా చేసుకుని ఆమె చుట్టూనే తిరుగుతాయి. పాత్రలను ప్రధానంగా చేసుకుని నడిచే కథలు కొన్ని ఉంటాయి.

ఈ తరహా సినిమాల్లో కథనే హీరోగా కనిపిస్తుంది .. అలాంటి కథనే 'గమనం'. సుజనారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను, క్రియా క్రియేషన్స్ వారు .. కలి ప్రొడక్షన్స్ వారు కలిసి నిర్మించారు. శ్రియ .. శివ కందుకూరి .. ప్రియాంక జవాల్కర్ .. చారు హాసన్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు.

ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శర్వానంద్ మాట్లాడుతూ .. "జ్ఞానశేఖర్ గారితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'కి తనే సినిమాటోగ్రఫర్.

అప్పటి నుంచి కూడా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. నన్ను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టుగా రమ్మంటే, మొన్ననే ఇదే ప్లేస్ కి 'లక్ష్య' ఈవెంట్ కి వచ్చాను అని చెప్పినా వినిపించుకోలేదు.

ఈ సినిమాకి నిర్మాతగా ఉన్నానని ఆయన చెప్పాడు .. 'ఎందుకు బాబా నీకు ఇవన్నీ' అన్నాను. అప్పుడు ఆయన నాకు ఈ సినిమా కథ చెప్పాడు. కథ విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది.

కొన్ని కథలు నచ్చినప్పుడు వాటిలో మనకి కూడా భాగం కావాలనిపిస్తుంది .. కానీ అలాంటి సినిమాలు చేయలేము .. అందుకు కొన్ని కారణాలు ఉంటాయి. ఇళయరాజాతో పాటలు చేయించుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి ఇళయరాజా ఈ సినిమాకి పనిచేయడం విశేషం.

శివ కందుకూరి మంచి ఆర్టిస్ట్. మంచి స్క్రిప్ట్ లు సెలెక్ట్ చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రియాంక జవాల్కర్ కూడా చాలా బాగా చేస్తోంది. ఇక సుజనారావు వర్కింగ్ స్టైల్ గురించి విన్నాను. తప్పకుండా తను ఈ సినిమాను చాలా బాగా తీసి ఉంటుంది. ఈ సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్ .. ఈ సినిమా ఈ నెల 10వ తేదీన రాబోతోంది.

అందరూ కూడా థియేటర్స్ కి వెళ్లి చూడండి. ఒక్క నిమిషం .. శ్రియ .. నేను ఇంతకుముందు 'నువ్వా నేనా' అనే సినిమాను చేశాము. ఆమెలో ఎలాంటి మార్పు లేదు. సంతోషంలో శ్రియ ఎలా ఉందో .. ఇప్పుడు కూడా అంతే అందంగా ఉంది. నేను ఆమె ఫ్యాన్ ని" అంటూ చెప్పుకొచ్చాడు.